Nimmagadda : ఆ వీడియోలు చూసి అవాక్కయిన నిమ్మగడ్డ.. వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు..

Nimmagadda(నిమ్మగడ్డ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ దొరబాబు పై జరిగిన దాడి ని తీవ్రంగా ఖండిస్తూ ఎన్నికల కమిషన్ కి తొలిసారిగా టీడీ జనార్దన రెడ్డి ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులను నామినేషన్లు వేయకుండా వైసీపీ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారనే దొరబాబు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన వివరించారు.

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న కుమారి అనే ఓ మహిళ భర్తను కిడ్నాప్ చేయగా.. వారిని పరామర్శించడానికి ఎమ్మెల్సీ దొరబాబు అక్కడికి వెళ్లారని ఆయన అన్నారు. అయితే కుమారి చేత నామినేషన్ వేయించాలని ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకు వెళుతుంటే.. మాజీ ఎంపీ ధనుంజయ్ రెడ్డి అనుచరులు కారుపై కర్రలతో, రాళ్లతో దాడులు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా మరో ఘటన పై టీడీపీ పార్టీ నాయకులైన వర్ల రామయ్య, అశోక్ బాబు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. కోటబొమ్మాలి ఎస్. పి, ఎస్. ఐ పోలీస్ అధికారులపై వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. నిమ్మాడలో కొన్నిచోట్ల శాంతిభద్రతలను కాపాడాలంటూ టీడీపీ మద్దతుదారులను నామినేషన్లు వేయకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని వర్ల రామయ్య, అశోక్ బాబు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదు చేసిన అనంతరం మీడియా ముందుకు వచ్చి నిమ్మాడ లో జరిగిన ఘటనలపై ఫిర్యాదు చేశామని.. నిమ్మాడ సిఐ ని సస్పెండ్ చేయాలని కూడా తాము ఫిర్యాదు చేశామని.. సిఐ ఓ చీడ పురుగని ఆయన అన్నారు.

పోలీసుల సమక్షంలోనే దువ్వాడ నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నా డిఎస్పి ఏమీ అనకుండా నవ్వుతున్నారని.. నరకండి చంపండి అని దువ్వాడ రెచ్చగొడుతున్నా డిఎస్పీ మౌన ప్రేక్షక పాత్ర వహించాలని వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిమ్మాడ ఘటనకు సంబంధించిన వీడియోలను చూసి ఎస్ఈసీ నిమ్మగడ్డ అవాక్కయ్యారని ఆయన అన్నారు.

Advertisement