Tirupati: తిరుపతి.. తీవ్రమైన పరిస్థితి..

Tirupati: ఇటీవలే లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నిక ముగిసిన తిరుపతిలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆధ్యాత్మిక నగరంలోని ప్రతి డివిజన్ లోనూ కొవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో సిటీ మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీషా ఈ విషయాన్ని వెల్లడించారు. వైరస్ కట్టడి దిశగా స్థానికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని కోరారు. తిరుపతి పరిధిలోని వాణిజ్య సంస్థల ప్రతినిధులు, వ్యాపార సంఘాల నాయకులు, ప్రజా రవాణా వాహనాల డ్రైవర్ల యూనియన్లు, ఇతర వర్గాల ప్రతినిధులతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గిరీషా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వెంకటప్పలనాయుడు తదితరులు ఇవాళ సోమవారం భేటీ అయ్యారు.

మధ్యాహ్నం 2 గంటల వరకే..

తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు ఘోరంగా పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ సెల్ఫ్ కంట్రోల్ పాటించాలని అధికార యంత్రాంగం సూచించారు. కొవిడ్-19 నివారణకు స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరంగా చేపట్టాల్సిన కఠిన చర్యలపైనా లోతుగా చర్చించారు. రేపు మంగళవారం నుంచి నగరంలోని అన్ని షాపులను మధ్యాహ్నం 2 గంటల వరకే ఓపెన్ చేసి ఉంచాలని, తర్వాత బంద్ పెట్టాలని స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు సర్కారుకు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇదేవిధంగా వాలంటరీగా ముందుకు రావాలని శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గడచిన వారం రోజుల్లో కరోనా పాజిటివిటీ 10 శాతం దాటిన, ఆక్సీజన్-ఐసీయూ పడకల భర్తీ 60 శాతం మించిన ప్రాంతాల్లో మినీ లాక్ డౌన్ లాంటి ఆంక్షలు పెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ నిన్న ఆదివారం సూచించిన నేపథ్యంలో తిరుపతిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.

రెండు విధాలుగా..

తిరుపతిలో ఈమధ్యే బైఎలక్షన్ ముగిసింది. దీనికి ముందు ఎన్నికల ప్రచారం నిమిత్తం వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు విపరీతంగా గుమిగూడారు. నగరం మొత్తం ఇంటింటింకీ కలియ తిరిగారు. దీనికితోడు తిరుపతి మీదుగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో ఇతర ప్రాంతాల, రాష్ట్రాల భక్తులు వస్తుంటారు. ఈ రెండు ప్రధాన కారణాలతో ఇక్కడ కొవిడ్-19 వైరస్ బాగా వ్యాప్తి చెందిందని భావిస్తున్నారు.

Advertisement