Tirupati: తిరుపతి ఉపఎన్నిక రద్దవుతుందా?..

Tirupati తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికను రద్దు చేయాలంటూ అధికార పార్టీ వైఎస్సార్సీపీ మినహా దాదాపు మిగతా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తెలుగుదేశం, బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీకి) లేఖలు రాశాయి. కమలం పార్టీ అభ్యర్థి కె.రత్నప్రభ నిన్న మంగళవారం ఏకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎలక్షన్ రిజల్ట్ ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రూలింగ్ పార్టీ భారీగా అక్రమాలకు పాల్పడిందని, పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకుందని, దొంగ ఓట్లు వేయించిందని, పోలీసులు కూడా వత్తాసు పలికారని.. ఇలా రకరకాల ఆరోపణలు చేశారు. వీటిపై చర్యలు తీసుకోవటంలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ప్రధాన ఎన్నికల కమిషనర్ విఫలమయ్యారని, అందుకే న్యాయస్థానానికి వచ్చానని కె.రత్నప్రభ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

 

క్రెడిట్ ఇవ్వొద్దనే..

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలి చూస్తుంటే తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికలో విక్టరీ క్రెడిట్ ని వైఎస్సార్సీపీకి మనస్ఫూర్తిగా ఇచ్చే ఉద్దేశం లేనట్లు అనిపిస్తోంది. టీడీపీ, బీజేపీ-జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ కూడబలుక్కొని ఈ దుష్ప్రచారానికి తెర తీసినట్లు అర్థమవుతోంది. అధికార పార్టీ గెలిచినా దొంగ ఓట్లతోనే గెలిచిందంటూ గేలిచేయటానికి, తమ ఓటమిని, తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి దీన్నొక మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయం అంటే ఇదా అని ప్రజలు ఛీ కొట్టేలా ఆయా పార్టీలు తమ స్థాయిని తామే దిగజార్చుకుంటున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని సక్సెస్ సాధించింది. కాబట్టి తిరుపతిలోనూ తమకు ఓటమి తప్పదని గ్రహించిన అపొజిషన్ పార్టీలు ఈ ఎత్తుగడ వేశాయని విమర్శకులు పేర్కొంటున్నారు.

నిజమైన ఓటర్లకు అవమానం..

ఏపీలోని ప్రతిపక్షాలు దొంగ ఓట్లు అనే మాటని ఒకటికి పది సార్లు వాడుతుండటంతో నిజమైన ఓటర్లను అవమానించినట్లు అవుతోంది. ఆయా పార్టీలు చెబుతున్నట్లు నిజంగానే దొంగ ఓటర్లు వచ్చి ఓటేస్తుంటే పోలింగ్ కేంద్రాల్లోని సంబంధిత పార్టీల ఏజెంట్లు ఏం చేస్తున్నట్లు?. ఓకే. ఏజెంట్లను కూడా కొనేశారనుకుందాం. అలా ఎంత మందిని కొనగలరు?. గవర్నమెంట్ ఆఫీసర్లు, పోలీసులు, ఎన్నికల పరిశీలకులు కూడా తమ ఉద్యోగాలను పణంగా పెట్టి ఐదు వేలకో, పది వేలకో అమ్ముడుపోతారా?. అయినా ఈ ఎలక్షన్ ని నిర్వహించింది సీఈసీ. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కాదు. ఒక వేళ ఎస్ఈసీ నిర్వహించి ఉంటే నీలం సాహ్నీ కాబట్టి జగన్ పార్టీ చెప్పినట్లు చేశారని ప్రతిపక్షాలు విమర్శించొచ్చు. కానీ ఈ ఎన్నికల్లో ఆమె పాత్ర ఏమీ లేదు. సీఈసీ తరఫున రాష్ట్ర వ్యవహారాలను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈవో) పర్యవేక్షిస్తారు. అపొజిషన్ పార్టీల హడావుడి చూస్తుంటే ఆయన కూడా అవినీతికి పాల్పడ్డాడనే అర్థం వస్తోంది. వీళ్లకు ప్రతిఒక్కరూ తప్పుగానే కనిపిస్తున్నారంటే అసలు తప్పు ఎవరిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోర్టు కూడా ఏం చెబుతుందో చూద్దాం. అప్పుడు గానీ ప్రతిపక్షాల నోళ్లు మూతపడవేమో.

Advertisement