Tirupathi Elections తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. బీజేపీ, జనసేన పార్టీలకు, ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి కత్తి రత్నప్రభకు ముచ్చెమటలు పట్టిస్తోంది. గాజు గ్లాసును మామూలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అనుకుంటాం. కానీ ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ‘‘గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ’’ అనే హోదా ఇంతవరకూ రాలేదు. అంటే గాజు గ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ పార్టీకి పార్ట్ టైమ్ ఎలక్షన్ సింబల్ మాత్రమే అన్నమాట. 2019 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల దాకే ఆ సింబల్ ని ఇచ్చారని అర్థం చేసుకోవచ్చు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఏ గుర్తు కేటాయించారో తెలియదు.
ఇప్పుడేమో మరో పార్టీకి..
తిరుపతి బై ఎలక్షన్ లో మాత్రం ఆ గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ‘‘నవతరం’’ అనే మరో పార్టీ క్యాండేట్ గోదా రమేష్ కుమార్ కి అలాట్ చేసింది. దీంతో జనసేన పార్టీ అభిమానులు, ఓటర్లు పొరపాటున, తొందరలో ఆ గుర్తు మీద నొక్కుతారేమోనని, ఫలితంగా పవన్ కళ్యాణ్ పార్టీ ఓట్లు క్రాస్ అవుతాయని సోము వీర్రాజు బ్యాచ్ తెగ భయపడిపోతోంది. అసలే గెలుపు అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయంటూ బెంగ పెట్టుకుంటుంటే ఇప్పుడు ఈ వార్త పిడుగులా వచ్చిపడిందని బీజేపీ-జనసేన క్యాడర్ ఆందోళన చెందుతోంది.
ఆశలపై నీళ్లు..
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వస్తాడో రాడో అని అనుకుంటున్న తరుణంలో ఆయన ఎట్టకేలకు నిన్న శనివారం రంగంలోకి దిగి రఫ్ఫాడిస్తున్నాడని బీజేపీ-జనసేన కంబైన్డ్ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. ఇంతలో గాజు గ్లాసు గుర్తు తెర మీదికి రావటంతో అంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా కమలం పార్టీకి ఇది పెద్ద తలనొప్పిలా తయారైంది. ఎన్నికల కమిషన్ నిర్ణయం పట్ల కాషాయం పార్టీ శ్రేణులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నాయి. జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్లే గాజు గ్లాసు గుర్తు తమ పార్టీకి వచ్చిందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.