TDP: తికమక.. మకతిక.. తెలుగుదేశం పరిస్థితి..

TDP ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీని పరేషాన్ చేస్తున్నాయి. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తికమక.. మకతిక.. నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక వైపు ఈ ఎలక్షన్లను బహిష్కరించి మరో వైపు హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికలను బాయ్ కాట్ చేసిన తర్వాత మళ్లీ న్యాయ స్థానంలో పోరాటం దేనికి?. జనం కోసం ఏదో చేస్తున్నామని ప్రచారం చేసుకోవటానికా అనే అనుమానం కలుగుతోంది. కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్నీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ అరాచకాలను అడ్డుకోలేరు, ఎలక్షన్లు నిష్పక్షపాతంగా నిర్వహించలేరు అని ఆరోపిస్తూ ఏపీ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు దూరంగా ఉంటామని ప్రకటించింది. అదే సమయంలో ఆ పార్టీ నేత వర్ల రామయ్య హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఎక్కడి నుంచి పెడితే ఏంటి?..

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఎక్కడైతే ఆగిపోయాయో అక్కడి నుంచే కొనసాగిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేశారు. దీంతో జనసేన, తెలుగుదేశం పార్టీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ‘‘ఇది సరికాదు.. ఎన్నికలను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించేలా ఆదేశించండి’’ అని కోరాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందంటూ ఈ రెండు పార్టీల తరఫున సీనియర్ అడ్వొకేట్లు నిన్న శనివారం హైకోర్టులో వాదనలు వినిపించారు. వాళ్ల అభిప్రాయం చెప్పటం అయిపోయింది. ఇక ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వ వాదనలను వినాల్సి ఉంది. ఇందుకోసం ఇవాళ ఆదివారం కూడా విచారణ జరుగుతుందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికైతే అప్డేట్ ఏమీ రాలేదు. కానీ.. చంద్రబాబు నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ ఆ పార్టీ లీడర్లు ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

హిందూపురంలో..

ఏపీలోని తెలుగు తమ్ముళ్లు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకే కాదు ఆయన వియ్యంకుడు బాలయ్య బాబుకు కూడా ఝలక్ ఇచ్చారు. హీరో నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం శాసన సభ్యుడు అనే సంగతి తెలిసిందే. ఆ నియోజకవర్గంలో ఆనంద్ అనే ఒక జెడ్పీటీసీ అభ్యర్థి, అశ్విని అనే ఒక ఎంపీటీసీ క్యాండేట్ తాజాగా ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి వట్టూరి వెంకట రాంబాబు, ఎంపీటీసీ క్యాండేట్ సరిపల్లి పద్మ తరఫున జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, నియోజకవర్గ బాధ్యుడు వలవల బాబ్జి సైతం ప్రచారం నిర్వహిస్తుండటం చెప్పుకోదగ్గ అంశం.

Advertisement