TDP vs YSRCP : ఫ్లాష్.. ఫ్లాష్.. : తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిపై మళ్లీ దాడి.. చేయించింది అతనేనట..

TDP vs YSRCP : ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తన అన్న కొడుకు అప్పన్నపై ఎటాక్ చేయించాడనే ఆరోపణలు రాగా ఇవాళ (మంగళవారం) విజయవాడలో తనపై మంత్రి కొడాలి నాని దాడి చేయించాడని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపిస్తున్నాడు.

ఏం జరిగింది?..

పట్టాభి చెప్పిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం ఆయన విజయవాడ(గురునానక్ నగర్)లోని తన ఇంటి నుంచి కారులో ఆఫీసుకు బయలుదేరగా అప్పటికే అక్కడికి దగ్గరలో కాపు కాచిన దాదాపు పది మంది దుండగులు ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. రాళ్లు, రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో పట్టాభి వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. సెల్ ఫోన్ పగిలిపోయింది. అతని మోచేతికి, మోకాళ్లకి దెబ్బలు తగిలాయి. డ్రైవర్ కూడా గాయపడ్డాడు.

భయపడను: TDP vs YSRCP

ప్రజల తరఫున పోరాడుతున్నందుకే తనపై దాడి జరిగిందని పట్టాభి విమర్శించారు. అయినా ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, ప్రాణాలు పోయే వరకు జనం కోసం పరితపిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. ఈ అరాచకంపై ఏపీ పోలీస్ బాసు ఆన్సర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘నన్ను టార్గెట్ చేయటం ఇది రెండోసారి. ఆరు నెలల కిందట కూడా ఒకసారి ఇలాగే జరిగింది. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ పట్టించుకోలేదు. అందుకే రిపీట్ అయింది’ అని పట్టాభి తప్పుపట్టారు.

నానీదే..

జగన్ సర్కార్ తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతోందని, ఇవాళ జరిగిన హత్యాయత్నం వెనక మంత్రి కొడాలి నానీ హస్తం ఉందని పట్టాభి ఆరోపించారు. కాగా పట్టాభిని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మరికొద్దిసేపట్లో ఆయన ఇంటికి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమ వచ్చి పరామర్శించారు.

Advertisement