TDP : తెలుగు దేశం పార్టీ పేరును ఆంధ్ర దేశం పార్టీ అని మార్చుకుంటే బెటరేమో..

TDP : తెలుగు దేశం పార్టీ (టీడీపీ) పేరును ఇకపై ఆంధ్ర దేశం పార్టీ (ఏడీపీ) అని మార్చుకుంటే బెటరేమో అని జోకులు పేలుతున్నాయి. ఎందుకంటే అది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం కానుంది. తెలంగాణ రాష్ట్ర శాసన సభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం ఇవాళ బుధవారంతో సున్నాకి దిగజారింది. ఇప్పటివరకూ చంద్రబాబు పార్టీకి ఈ తెలుగు రాష్ట్ర అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఉండేవారు. ఆయన పేరు మెచ్చా నాగేశ్వర్ రావు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎస్టీ రిజర్వ్ డ్ నియోజకవర్గంలో టీడీపీ తరఫున గెలిచారు. ఆయన ఈరోజు తన పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరారు. ముందుగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి చర్చించారు. ఆ తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయి తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షాన్ని (టీడీఎల్పీని) గులాబీ పార్టీలో కలుపుతున్నట్లు లెటర్ ఇచ్చారు.

TDP : telugu desam party zero in telangana assembly
TDP : telugu desam party zero in telangana assembly

చాలా లేటైంది..

2018 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఇద్దరు మాత్రమే గెలిచారు. ఆ సెగ్మెంట్లు రెండూ ఖమ్మం జిల్లాలోనే ఉండటం గమనార్హం. ఒకటి అశ్వారావుపేట. రెండు సత్తుపల్లి. ఎస్సీలకు రిజర్వ్ చేసిన సత్తుపల్లి నియోజకవర్గంలో టీడీపీ నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య తర్వాతి పరిణామాల్లో కారు పార్టీలో జాయిన్ అయ్యారు. వాస్తవానికి ఈ మెచ్చా నాగేశ్వర రావు కూడా అప్పుడు ఎన్నికలు పూర్తయిన కొన్నాళ్లకే (ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే) టీఆర్ఎస్ లోకి జంప్ చేస్తారని అన్నారు. కానీ.. ఎందుకో రెండున్నరేళ్లు వేచి చూసి ఎట్టకేలకు ఇవాళ ఆ పని పూర్తి చేశారు. ఈ సమయంలో మెచ్చా నాగేశ్వర రావు వెంట సండ్ర వెంకట వీరయ్య కూడా ఉండటం చెప్పుకోదగ్గ విషయం.

చాప్టర్ క్లోజ్: TDP

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచే తెలుగు దేశం పార్టీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ముందుగా కేసీఆర్ వెళ్లిపోయారు. నాటి నుంచి నేటి వరకు ఆ వలసలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ్టికి పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది. టీడీపీ-టీఎస్ ప్రెసిడెంట్ ఎల్.రమణ ఎన్నికల్లో పోటీ చేసినా దేఖే వాళ్లు లేరు. కాబట్టి తెలంగాణలో టీడీపీ చాప్టర్ క్లోజ్ అయింది ప్రత్యేకంగా అనాల్సిన పనిలేదు. అందుకే.. ఆనాడు చంద్రబాబు(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో) కేసీఆర్ ని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ని చేయకుండా తన కేబినెట్ లోకి మంత్రిగా తీసుకొని ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదని ఏపీ మంత్రి కొడాలి నానీ లేటెస్టుగా జోక్ గా గుర్తు చేయటం గమనార్హం.

Advertisement