TDP : కాపీ కొట్టడంలో టీడీపీ తర్వాతే ఏ పార్టీ అయినా

TDP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కాపీ కొట్టడంలో తనకి తిరుగులేదని నిరూపించుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను చూసి అచ్చం అవే అక్కడా ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ ని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రభుత్వం కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ స్కూల్ టీచర్లకి నెలకి రూ.2,000 నగదు, ఒక్కొక్కరికి 20 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తోంది కదా. దీంతో ఏపీలో సైతం వైఎస్సార్సీపీ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులను ఆర్థికంగా ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇవాళ గురువారం డిమాండ్ చేశారు.

tdp-tdp-in-ap-copying-telangana-schemes-to-demand-cm-jagan
tdp-tdp-in-ap-copying-telangana-schemes-to-demand-cm-jagan

రూ.10 వేలు ఇవ్వండి..

ప్రైవేట్ టీచర్ల పట్ల ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగదని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్-19 కారణంగా వాళ్ల జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లెటర్ కూడా రాశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పాతిక మంది ప్రైవేట్ టీచర్లు ఆర్థిక సమస్యలతో చనిపోయారని చెప్పారు. ఇంత జరుగుతున్నా సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఒక్కొక్కరికి ఏపీ గవర్నమెంట్ రూ.10 వేలు ఇవ్వాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

పరీక్షల విషయంలోనూ: TDP

పదో తరగతి పరీక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ని కూడా క్యాన్సిల్ చేసి సెకండ్ ఇయర్ కి ప్రమోట్ చేసింది. సెకండియర్ పరీక్షలను ప్రస్తుతానికి వాయిదా వేసింది. జూన్ తర్వాత వాటిపై సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఏపీలోని అపొజిషన్ పార్టీ టీడీపీ అక్కడ కూడా టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని జగన్ సర్కార్ ని కోరుతోంది. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇవాళ కాస్త సెంటిమెంటల్ గా రియాక్టయ్యారు. దేవాన్ష్ కి తండ్రిగానే కాకుండా రాష్ట్రంలోని ప్రతి చిన్నారి బాధ్యత తనదని చెప్పారు. దేవాన్ష్ కి ఎగ్జామ్స్ ఉంటే ఫాదర్ గా ఎలా ఆలోచిస్తానో రాష్ట్రంలోని పిల్లలందరి గురించీ అలాగే ఆలోచిస్తానని తెలిపారు. కరోనా కష్ట కాలంలో ఎగ్జామ్స్ రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Advertisement