TDP : టీడీపీ భవిష్యత్తు ఇదే, లోకేష్ ఇప్పటికైనా మేలుకో !

Kondala Rao - January 27, 2021 / 11:09 AM IST

TDP : టీడీపీ భవిష్యత్తు ఇదే, లోకేష్ ఇప్పటికైనా మేలుకో !

TDP : తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కథ ఇప్పటికే ఒక తెలుగు రాష్ట్రంలో (తెలంగాణ రాష్ట్రంలో) కంచికి చేరింది. ఇక రెండో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా కంచి అంచులకు కొద్ది దూరంలో ఉంది. ముందు రోజుల్లో ఈ పార్టీ పరిస్థితి ఏంటనేది నాయకుల తీరు మీదే ఆధారపడి ఉంది. కానీ ఒక్కో నాయకుడూ పార్టీని వీడిపోవటమో.. అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పటమో చేస్తున్న నేపథ్యంలో టీడీపీ జనరల్ సెక్రెటరీ, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇప్పటికైనా మేలుకోవాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మురళీమోహన్..

టీడీపీకి, ఎన్టీఆర్ కి, చంద్రబాబుకి.. పార్టీలోని ప్రతిఒక్కరికీ సన్నిహితుడైన సీనియర్ నాయకుడు, నటుడు మురళీమోహన్ లేటెస్టుగా పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పేశారు. నిజ జీవితంలో త్రిపాత్రాభినయం(యాక్టర్, లీడర్, బిజినెస్ మ్యాన్) చేసిన ఆయన ఇక పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయిస్తానని తేల్చిచెప్పేశారు. ఓ వైపు తలపండిన నేతలు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా, మరో వైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, చోటా మోటా నాయకులు పార్టీని వీడుతుంటే భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఎన్టీఆర్ వారసులు: TDP

అసలు తన కుమారుడు లోకేష్ బాబు కోసమే చంద్రబాబు ఎన్టీఆర్ వారసులను తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంచారనే అపవాదు ఉంది. 2014 ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ 2019 ఎలక్షన్లలో దూరంగా ఉండిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్లను మర్చిపోవటం, అవసరంలో ఉన్నప్పుడు గుర్తుకు తెచ్చుకోవటం చంద్రబాబుకు అలవాటే అనే ప్రచారమూ ఉంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ వారసులు పార్టీని భుజాన వేసుకునే పరిస్థితిలేదు.

మిత్రులేరి?..

2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తుపెట్టుకోవటంతో చంద్రబాబు బయటపడ్డారు. 2019కి వచ్చేసరికి ఆ రెండు పార్టీలు తెలుగుదేశం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో టీడీపీకి ఓటమి తప్పలేదు. 2024లోనేమో జనసేన, బీజేపీ కలిసి పోరాడాలని ఇప్పటికే డిసైడ్ అయ్యాయి. కాబట్టి మరోసారి తెలుగుదేశానికి మిత్రులు కరువవుతున్నారు. దీంతో టీడీపీ పరిస్థితి ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం అనట్లే కనిపిస్తోంది. చంద్రబాబుకు కూడా అప్పటికల్లా వయసు మీద పడుతుంది.

TDP-tdp-future-in-ap-question-mark

TDP-tdp-future-in-ap-question-mark

కిం కర్తవ్యం?: TDP

పైన చర్చించిన పాయింట్లన్నింటినీ దృష్టిలో లోకేష్ బాబు ఆవేశంగా జగన్ పార్టీ పైన, ప్రభుత్వం పైన చిందులు తొక్కటం కన్నా ఆలోచనకు పదును పెట్టి ముందుకు సాగాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. లేకపోతే తండ్రి వైఎస్, కొడుకు జగన్ చేతిలో ఓడిన చంద్రబాబు మాదిరిగా లోకేష్ కి కూడా షాక్ ల మీద షాకులు తప్పకపోవచ్చని హితవు పలుకుతున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us