షాక్ మీద షాక్.. వైసీపీ కీలక నేతతో టీడీపీ ముఖ్య నేత మీటింగ్ పెట్టుకున్నారా ?
Surya - November 7, 2020 / 04:00 PM IST

ఈరోజుల్లో షాకులు తినడం అలవాటైపోయిన నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడుగారే. ఆయనకు తగులుతున్న ఎదురుదెబ్బలకు లేకే లేకుండా పోయింది. ఒకదాని నుండి కోలుకునేలోపు ఇంకొకటి తగులుతూ కుంగదీస్తున్నాయి. వరుసపెట్టి ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుంటే ఉన్నవారిని కాపాడుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. వీటికి తోడు పదవుల పంపకంలో నేతలు అలగడం, బయటికి వెళతామని సంకేతాలిస్తుండటం మరో పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం పార్టీలో ఉన్న లీడర్లంతా చంద్రబాబు ముందు పెట్టిన డిమాండ్ ఒక్కటే.. తమను అధికార పార్టీ నుండి ఏ విధంగా కాపాడుతారని. తెలుగుదేశంకు చెందిన నాయకుల ఆర్ధిక మూలాల మీద పెద్ద దాడే జరుగుతోంది.
జేసీ బ్రదర్స్ లాంటి వాళ్ళే ఆ దెబ్బకు తట్టుకోలేక తలకిందులైపోయారు. గళ్ళ జయదేవ్ కోర్టుకెళ్లి ఉపశమనం పొందుతున్నారు. బయటికి కనిపించట్లేదు కానీ చాలామందిది ఇదే పరిస్థితి. ఈమధ్యే గీతం యూనివర్సిటీ మీద పంజా విరింది ప్రభుత్వం. ఈ జాబితాలో అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా ఉన్నారు. ఆయనకున్న వ్యాపారాలు, మైనింగ్ బిజినెస్ ఇరకాటంలో పడ్డాయి. భారీ జరిమానాలు జరిమానాలు పడ్డాయి. వాటి నుండి తాత్కాలికంగా బయటపడినా భవిష్యత్తులో సమస్యలు తప్పవని గొట్టిపాటి రవి భావిస్తున్నారట.. దీంతో ఆయనకు ఒక్కటరే పరిష్కారంగా కనిపిస్తోందట.
అదే పార్టీని వీడి వైసీపీకి మద్దతు ఇవ్వడం. ఆయన త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని టీడీపీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. గొట్టిపాటి రవి మూడు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఆయన 2014 ఎన్నికలప్పుడు టీడీపీలో చేరి గత రెండు సార్లు అద్దంకి నుండి గెలిచారు. ఈయన మీద చంద్రబాబుకు చాలా నమ్మకం ఉంది. అందుకే అద్దంకిలో ఆయనకు పోటీగా ఉన్న కరణం బలరామమూర్తిని చీరాలకు షిఫ్ట్ అయ్యేలా చేశారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన బయటకు వెళ్లాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆయన వైసీపీలోని కీలక మంత్రితో భేటీ అయ్యారని, వచ్చే ఎన్నికల్లో టికెట్ మీద హామీ తీసుకున్నారని ప్రకాశం టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే టీడీపీకి అద్దంకిలో కోలుకోలేని దెబ్బ తగిలినట్టే.