Chandra Babu: నిదానమే ప్రధానమని.. నీకు తెలియంది కాదు..

Chandra Babu ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలు చంద్రబాబు పరువుని నిలువునా తీస్తున్నాయి. ఆయనకి ఇవాళ బుధవారం ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఒకటేమో ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎలక్షన్లకి సంబంధించింది కాగా మరొకటేమో విగ్రహాల ధ్వంసం తాలూకాది. మండల, జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకి రేపు గురువారం పోలింగ్ పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్నీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా సింగిల్ బెంచ్ ఆయనకి అనుకూల తీర్పు ఇచ్చింది. ఎలక్షన్ షెడ్యూల్ పై నిన్న మంగళవారం స్టే విధించింది. దీంతో మీడియా మైకు అందుకున్న చంద్రబాబు ‘‘కోర్టు తీర్పుతో మా వాదనే కరెక్ట్ అని తేలింది. సీఎం జగన్ ఇప్పటికైనా న్యాయస్థానాలను గౌరవించాలి. అవి ఇచ్చే ఉత్తర్వులను అమలు చేయాలి’’ అంటూ లెక్చర్ ఇచ్చాడు.

Chandra babu

కానీ.. ఇవాళ..

ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికలను నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఎస్ఈసీ నిన్న రాత్రే డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేసింది. దీనిపై ఇవాళ పొద్దున విచారణ జరిపిన హైకోర్టు మధ్యాహ్నం తీర్పును వెల్లడించింది. ఎలక్షన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు అపొజిషన్ లీడర్ చంద్రబాబు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ముఖ్యమంత్రికి చెప్పిన నీతులు ప్రస్తుతం ఆయనకు కూడా వర్తిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ జడ్జిమెంట్ పై టీడీపీ బహుశా సుప్రీంకోర్టుకు వెళుతుందేమో. ఒకవేళ వెళ్లినా అంత అర్జెంట్ గా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతుందనే గ్యారెంటీ లేదు. తెల్లారితే పోలింగే. అయినా పరిషత్ ఎన్నికలని బహిష్కరించిన తెలుగుదేశం పార్టీకి అవి జరిగితే ఏంటి? జరక్కపోతే ఏంటి?.

చిత్తూరు ఎంపీ వార్నింగ్..

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో లేటెస్టుగా ఒక ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారనే వార్తలు వచ్చాయి. దీంతో చంద్రబాబు తనదైన శైలిలో జగన్ సర్కార్ పై మండిపడ్డారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. అయితే ఈ కేసును చిత్తూరు జిల్లా పోలీసులు సంఘటన జరిగిన 24 గంటల్లోపే (ఈ రోజు సాయంత్రం లోపే) ఛేదించారు. మతి స్థిమితం లేని ఒక మహిళే ఈ పనికి పాల్పడిందని తేల్చారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకులు నిజానిజాలేంటో తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా.. ఈ రెండు పరిణామాలను బట్టి అర్థమయ్యేదేంటంటే పాలిటిక్స్ లో ఫార్టీ ఇయర్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ‘నిదానమే ప్రధానం’ అనేది పాటిస్తే బాగుంటుందనిపిస్తోంది.

Advertisement