Sajjala Ramakrishna Reddy : క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేలను వైసీపీ ముందే గ్రహించిందా..?
NQ Staff - March 24, 2023 / 09:32 AM IST

Sajjala Ramakrishna Reddy : ఏపీలో ఏడు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించగా అందులో అనూహ్యంగా టీడీపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. వైసీపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. వాస్తవానికి ఏడు స్థానాలను గెలుచుకునే సంఖ్యాబలం వైసీపీకి ఉంది. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాల్సిం ఉంటుంది.
ఈ లెక్కన చూస్తే టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వైసీపీకి 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని తాము ముందు నుంచే లెక్కలోకి తీసుకోలేదంటూ వైసీపీ చెబుతోంది. పోనీ ఈ ఇద్దరూ టీడీపీకి ఓటేసినా ఇంకో రెండు ఓట్లు వైసీపీ నుంచి పడితేనే టీడీపీ విజయం సాధిస్తుంది.
దాంతో ఇప్పుడు ఆ ఇద్దరూ ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిపై ఆరోపణలు రావడంతో శ్రీదేవి తన తప్పు చేయలేదని స్పందించింది. కానీ చంద్రశేఖర్ రెడ్డి మాత్రం స్పందించలేదు.
వాస్తవానికి టీడీపీ పంచుమర్తి అనురాధను పోటీలో నిలిపినప్పుడే వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని వైసీపీ భావించినట్టుంది. ఎలాగూ డబ్బులకు అమ్ముడు పోతారని ముందే గ్రహించి తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఎమ్మెల్యేలను పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇక వారు ఎవరో తాము గుర్తించామని సజ్జల రామకృష్ణ రెడ్డి చెబుతున్నారు.
వారి పేర్లు ఇప్పుడే చెప్పలేమని, త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. కానీ జగన్ మాత్రం వారిని లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీకి నష్టం చేసే వారిని ఇలా అయినా గుర్తించే అవకాశం దక్కినట్టు జగన్ భావిస్తున్నారు. ఒక ఎమ్మెల్సీ పోయినంత మాత్రాన నష్టం లేదని జగన్ అనుకుంటున్నారంట.
అందుకే వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం చేసే వారిని ఏరి పారేయాలని, అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక బాగా ఉపయోగపడినట్టు వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరి సజ్జల చెప్పినట్టే త్వరలోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా లేదా అనేది చూడాలి.