Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. సినిమా నటుడు. చంద్రబాబు.. సహజ నటుడు..

Pawan Kalyan తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికకు ప్రచార గడువు ఈ రోజుతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి ఆఖరి నిమిషంలో పదును పెట్టాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భలే విమర్శ చేశారు. ‘ఒక్క దెబ్బకు రెండు పిట్లలు’ అన్నట్లు మాట్లాడారు. అటు ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి, ఇటు బీజేపీ మిత్రపక్షం జనసేనకు ఒకేసారి సెటైర్ వేశారు. జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నటుడయితే టీడీపీ చీఫ్ చంద్రబాబు సహజ నటుడు అని ఎద్దేవా చేశారు. సినిమా నటులతో జనానికి పెద్దగా నష్టం లేదని, సహజ నటులతోనే పబ్లిక్ కి ప్రాబ్లమని పరోక్షంగా హెచ్చరించారు. న్యాచురల్ యాక్టర్లు రోజూ నటిస్తూ మోసగిస్తారంటూ అలర్ట్ చేశారు.

దొందూ.. దొందే..

టీడీపీ, బీజేపీ దొందూ దొందేనని, అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఈ రెండు పార్టీలను ఛీ కొట్టినా రెండేళ్ల తర్వాత కూడా వాటిలో ఏమాత్రం మార్పు రాలేదని చురకలంటించారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారో చెప్పుకునే పరిస్థితిలో ఇప్పుడు లేరని, అందుకే వైఎస్సార్సీపీ పై అభాండాలు వేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ, అభిమానం చూడలేక దిగజారుడు రాజకీయాలకు పాల్పడతున్నాయని దుయ్యబట్టారు.

అచ్చెన్న చెప్పింది నిజమే..

తెలుగుదేశం పనైపోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా అంటున్నారని, ఆయన నిజమే చెప్పారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. లోకేష్ దెబ్బకి టీడీపీ దివాళా తీసిందని, ఖాళీ అయిందని కూడా ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెంది లాక్డౌన్ పెట్టినప్పుడు తమ ప్రభుత్వం పలు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసిందని చెప్పారు. లబ్ధిదారులకు ఆయా పథకాల నిధులను డైరెక్టుగా వారి అకౌంట్లలోనే వేశామని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో అపొజిషన్ పార్టీ ఆడిన రాళ్ల దాడి నాటకం ఒట్టి హైడ్రామా మాత్రమేనని సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టిపారేశారు.

Advertisement