‘‘చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా’’.. ఎవరు స్థాపించారో తెలుసుకోవాలని ఉందా?
Kondala Rao - December 29, 2020 / 02:46 PM IST

చంద్రబాబు నాయుడికి ఒక పార్టీ అంటూ ఉంది కదా. తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి ఆయన కరెంట్ నేషనల్ ప్రెసిడెంట్ కదా. ఆయన పేరు మీద మరో పార్టీ రావటం ఏంటీ అనుకుంటున్నారా? అదే మరి ఇంట్రస్టింగ్ స్టోరీ అంటే. ఏపీలో అధికార పార్టీ తరఫున అదిరిపోయే పంచ్ లు వేసే నాటి కథానాయకి, నేటి ప్రజానాయకి రోజా ఉండనే ఉన్నారు కదా. ఆమే ఈ కొత్త కోడింగ్ కనిపెట్టారు.
భలె భలె నారాయణోయ్..
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీలో సీఎం జగన్ రీసెంటుగా ప్రారంభించిన ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విమర్శించటాన్ని చిత్తూరు జిల్లాలోని నగరి ఎమ్మెల్యే రోజా తప్పుపట్టారు. మఖ్యమంత్రి జగన్ తన ఇంట్లో కుక్కల్ని కట్టేసే అంత స్థలాన్ని కూడా పేదలకు ఇవ్వట్లేదని నారాయణ ఎద్దేవా చేయటం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తలవంపులు తెస్తున్నారు..
నారాయణ సీపీఐని ఉద్ధరించటం పక్కన పెట్టి తరచూ నోరు జారటం ద్వారా సొంత పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని రోజా దెప్పిపొడిచారు. ఎర్ర జెండా పార్టీలు ధర్నాలు, డిమాండ్లు చేయకపోయినా వైఎస్సార్సీపీ ఇళ్ల పట్టాలు ఇస్తోందని చెప్పారు. ఆ మాటకొస్తే నారాయణ నగరి నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారు అని ఆమె నిలదీశారు. సీపీఐ ఫుల్ ఫామ్ అందరికీ తెలుసని, దాన్ని నారాయణ.. ‘‘చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా’’గా మార్చారంటూ చురకలంటించారు.
గంట లోపలే స్పందించాడు..
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా తనకు కౌంటర్ ఇచ్చిన గంట లోపలే నారాయణ ఎన్ కౌంటర్ వేశాడు. మళ్లీ కుక్కల అంశాన్నే లేవనెత్తాడు. జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లో అంత విశ్వాసం కలిగిన కుక్కలే ఉండి ఉంటే ఆయన ఎందుకు హత్యకు గురవుతారు అని రోజాను ఘాటుగా ప్రశ్నించారు. ఒకప్పుడు చంద్రబాబు పార్టీ(టీడీపీ)లోనే ఉండి తర్వాత ఆయన్ని వ్యతిరేకించి వైఎస్సార్ ని సపోర్ట్ చేసినప్పుడు ఆమె సామాజిక వర్గం ఏమైనా మారిందా అని సూటిగా అడిగారు. రోజా మాదిరిగా తాను పార్టీలు, కులాలు మారలేదని దుయ్యబట్టారు.