Raghu Rama Raju: అచ్చెన్న అందుకున్నాడు.. బాలినేని బదులిచ్చాడు..

Raghu Rama Raju: ఏపీలో చీమ చిటుక్కుమన్నా సీఎం జగనే కారణం అంటూ గుడ్డిగా విమర్శించే తెలుగుదేశం పార్టీ ఇవాళ శుక్రవారం రాత్రి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు పైనా అలాగే స్పందించింది. ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు సరికాదని తప్పుపట్టింది. అక్కడికి అతను మాట్లాడే విధానమేదో బాగున్నట్లు వెనకేసుకొచ్చింది. ఎంపీ అరెస్టు అప్రజాస్వామికం అంటూ అలవాటైన పదాలను వాడేసింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తోందని మండిపడింది. జగన్మోహన్ రెడ్డి అనే పూర్తి పేరు పలకటానికి కూడా ఇష్టపడలేదు. ఈ మేరకు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.

‘‘తెలుగు’’ భాష.. పచ్చ భాష..

అధికార పార్టీ వైఎస్సార్సీపీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని విమర్శించటం కోసం తెలుగుదేశం పార్టీ వాడే ప్రత్యేక, పచ్చ భాష మనందరికీ తెలిసిందే. అదేంటంటే.. ఏపీలో రూల్ ఆఫ్ లా లేదు.. అంతటా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది.. రఘురామకృష్ణరాజుపై కక్ష సాధిస్తున్నారు.. పోలీసులు ఖాకీ డ్రస్సును పక్కన పెట్టారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని విడిచి పెట్టారు.. టీడీపీ ఇదే లాంగ్వేజ్ ని ఇవాళ కూడా ఉపయోగించింది.

ఓపికమంతుడు కాబట్టి..

ప్రతిపక్ష టీడీపీ విమర్శలను రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమర్థంగా తిప్పి కొట్టారు. వైఎస్సార్సీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ప్రస్తుతం సైకోలా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. గవర్నమెంటును నోటికొచ్చినట్లు తిట్టడానికి అతనికి సిగ్గుండాలని చురకలంటించారు. వాడి గురించి మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉందని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ కోసం పడిగాపులు కాసినోడు, జగన్ బొమ్మతో గెలిచినోడు ఇప్పుడు ఈరకంగా వ్యవహరించటం పట్ల ఆగ్రహం వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఓపికమంతుడు కాబట్టే అతడి విషయంలో ఇన్నాళ్లూ వేచి చూశారని పేర్కొన్నారు. పర్సనల్ గా టార్గెట్ చేసినా సీఎం ఏమీ అనలేదని, అందుకే అతడు రెచ్చిపోయాడని గుర్తు చేశారు. ఇక ఆ ఎంపీ చేసిన తప్పులకు చట్టమే సమాధానం చెబుతుందని, తన పని తాను చేసుకుపోతుందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తేల్చిచెప్పారు.