PM Narendra Modi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెర మీదికి వస్తోంది. నిన్న(శనివారం) ప్రధాని మోడీతో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) కూడా పోరాటానికి సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తదితరులకు లీగల్ నోటీసులు ఇవ్వటానికి సమాయత్తమవుతోంది. ఆ నోటీసులకు వాళ్లు ఏం సమాధానం చెబుతారో దాన్నిబట్టి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకోవాలని భావిస్తోంది.
ఎప్పుడేం జరిగింది?..
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీ డెవల్మెంట్ కోసం ఐదేళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇవ్వనున్నట్లు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ ఎగువ సభలో ప్రకటించారు. అప్పట్లో పెద్దల సభలో సభ్యుడైన ప్రస్తుత ఉపరాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఆ సందర్భంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఐదేళ్లు చాలదని, పదేళ్లు కావాలని కోరారు. అదే సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. తిరుపతిలో జరిగిన ఎన్నికల సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, బీజేపీ నేతలు నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ మీటింగులో చంద్రబాబు మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్ పదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలన్నారు.
సీన్ కట్ చేస్తే: PM Narendra Modi
2014 ఎలక్షన్లలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ గెలిచాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా గానీ స్పెషల్ ప్యాకేజీ గానీ తెచ్చిన పాపాన పోలేదు. చంద్రబాబు ఓడిపోయి జగన్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రత్యేక హోదా గురించి ఒకటికి పది సార్లు అడుగుతున్నా కేంద్రంలో కదలిక లేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకే దిక్కులేని పరిస్థితి తలెత్తిందంటే ఇక ఏపీని ఆదుకునేదెవరని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. తెలంగాణ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ లో హస్తం పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. దీంతో పోయిన చోటే వెతుక్కోవాలనే పట్టుదల ఏపీసీసీ లీగల్ సెల్ ప్రదర్శిస్తోంది.

మోసం చేస్తే..
తమ పార్టీ ప్రధానమంత్రే (మన్మోహన్ సింగే) ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చినప్పటికీ దాన్ని అమలుచేయటానికి ఆయన ప్రస్తుతం ఆ పదవిలో లేరు. కాబట్టి ప్రధాని హోదాలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత పీఎం మోడీ పైన ఉందని కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తేల్చిచెబుతోంది. మోడీ తనన పనిని తాను చేయని పక్షంలో కోర్టుల ద్వారా ఆయనకు బాధ్యతలను గుర్తు చేస్తామని హెచ్చరిస్తోంది. ప్రజలను మోసం చేసిన అభియోగాన్ని ఆయనపై మోపబోతోంది. ఈ అభియోగం, నేరం రుజువైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అరెస్ట్ తప్పదేమో అని న్యాయ వర్గాలు వార్నింగ్ ఇస్తున్నాయి.