Pawan Kalyan: అజ్ఞాన వాసి.. అద్దె మైకు..

Pawan Kalyan పవన్ కళ్యాణ్ కి కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి. ఆయన నిన్న శనివారం తిరుపతిలో ఉప ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి అధికార పార్టీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే కదా. దీంతో ఇవాళ ఆదివారం వైఎస్సార్సీపీ రంగంలోకి దిగింది. పవర్ స్టార్ పై పవర్ ఫుల్ సెటైర్లు వేసింది. జనసేన పార్టీ అధినేతకు రాజకీయ పరిజ్ఞానం లేదని, ఆయన అజ్ఞాతవాసి మాత్రమే కాదు అజ్ఞానవాసి కూడా అని ఏపీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఆ మెగా హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్దె మైకులా తయారయ్యారని, అప్పుడప్పుడూ వచ్చిపోతుంటాడని కూడా చురకలు అంటించారు. ఈ మేరకు మంత్రి ఈ రోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

ఉత్తరాది పార్టీ అయిన బీజేపీ దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేస్తోందంటూ ఒకప్పుడు విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీకే ఓటు వేయాలని తిరుపతి జనాన్ని కోరటం విడ్డూరంగా ఉందని మంత్రి పేర్ని నానీ అన్నారు. పవర్ స్టార్ లేవనెత్తిన ప్రతి అంశానికీ ఆయన ధీటుగా సమాధానం చెప్పారు. ఏపీలో హిందూ దేవుళ్ల విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం తదితర కేసుల్లో కమలం పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. అందుకే తాము సీబీఐ దర్యాప్తు కోరినా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదని తప్పుపట్టారు.

స్క్రిప్ట్ రీడర్..

ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా.. అంటూ పొలిటికల్ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ చివరికి ఒక స్క్రిప్ట్ రీడర్ గా మారారని మంత్రి పేర్ని నాన్ని విమర్శించారు. వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోందని, ఆ సంస్థ కేంద్రం చేతుల్లోనే ఉంటుందన్న విషయం పవర్ స్టార్ కి తెలియదనే సంగతి నిన్నటితో తేలిపోయిందని నానీ చెప్పారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును పవన్ కళ్యాణ్  చదువుతున్నారు తప్ప ఆయనకు వాస్తవాలు తెలియవని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వంటి అంశాలపై జనసేన అధ్యక్షుడు కాషాయం పార్టీని నిలదీయాలని సూచించారు. బీజేపీ ఏపీ వ్యవహారాల కోఇన్చార్జ్ సునీల్ దేవ్ ధర్ ఒక ఊరిలో ప్రెసిడెంట్ గా నిలబడ్డా గెలవలేరని మంత్రి పేర్ని నానీ పేర్కొన్నారు.

Advertisement