Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కాదు.. పవన్ నాయుడు. పవర్ స్టార్ కాదు పవర్ లేని స్టార్..

Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా తాటికొండ ఎమ్మెల్యే (వైఎస్సార్సీపీ) ఉండవల్లి శ్రీదేవి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదని పవర్ లేని స్టార్ అని ఎద్దేవా చేశారు. ఆయన పేరును కూడా పవన్ నాయుడు అంటూ సంభోదించారు. తద్వారా ఆ హీరో సామాజిక వర్గాన్ని ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ ఆరు నెలలకు ఒకసారి కనిపించే వ్యక్తి అని సెటైర్లు వేశారు. ఆయన వల్ల జనానికి ఒరిగేదేం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆమె సోమవారం గుంటూరులోని వైఎస్సార్సీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.

రెండు చోట్లా..

తన లాంటి కొత్త వాళ్లే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వెళితే సినిమా హీరోగా ప్రజల్లో ఎంతో ఆదరణ కలిగిన పవన్ కళ్యాణ్ మాత్రం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని ఉండవల్లి శ్రీదేవి గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహర్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుండటం వల్లే ఎక్కువ పంచాయతీలను గెలుచుకున్నామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం కంచుకోటలను కూడా తమ పార్టీ బద్ధలు కొట్టి పాగా వేసిందని తెలిపారు. టీడీపీ సపోర్ట్ ఉన్నవాళ్లే ఎక్కువ పల్లెల్లో నెగ్గారనటం శుద్ధ అబద్ధమని తోసిపుచ్చారు. భవిష్యత్తులో కూడా ఏ ఎలక్షన్ జరిగినా వైఎస్సార్సీపీదే పైచేయి కాబోతోందని ఉండవల్లి శ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు.

Pawan Kalyan : ysrcp mla sridevi fires on pawan kalyan
Pawan Kalyan : ysrcp mla sridevi fires on pawan kalyan

కౌంటర్లా?: Pawan Kalyan

త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికలతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్సీ తదితర అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగిస్తుందని తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతో ఏపీ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, పంచాయతీ ఎన్నికల ఫలితాలే దానికి అద్దంపడుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన్ని వెనకేసుకొచ్చే పచ్చ మీడియా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని శ్రీదేవి మండిపడ్డారు. జనసేన పార్టీ అభ్యర్థులు మొదటి మూడు దశల ఎన్నికలతోపాటు నాలుగో దశ ఎన్నికల్లో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో సక్సెస్ సాధించారని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పునకు ఇది నిదర్శనమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ వరుస ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో వాటికి కౌంటర్ గా ఉండవల్లి శ్రీదేవి ఈ రోజు ఇలా వ్యాఖ్యానించినట్లు పరిశీలకులు వివరిస్తున్నారు.

Advertisement