Pawan Kalyan: నన్ను కాపు నాయకులు తిడుతున్నారు.. పవన్ కల్యాణ్ ఎమోషనల్..!
NQ Staff - March 15, 2023 / 09:28 AM IST

Pawan Kalyan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే దూకుడు పెంచుతోంది. జనసేన పార్టీ స్థాపించి పది సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీ పట్నంలో పదో వార్షిక ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ అనేక విషయాలను వెల్లడించారు. ముందుగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు చెక్కులు అందజేశారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ.. నేను ఓడిపోయినా సరే ప్రజల కోసమే రెండు చోట్ల నిలబడ్డాను. గెలుపు ఓటములు సహజం.. కానీ మహానుభావుల స్పూర్తిని ముందుకు తీసుకెళ్లాలి. ఏపీలో పులివెందుల సహా అన్ని నియోజకవర్గాల్లో మనకు క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు. ఎప్పటికైనా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం ఉంది.
అన్ని కులాల కోసం..
ఏపీలో మొత్తంగా 6.5 లక్షల క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు. నేను కులాన్ని అమ్మేస్తానంటే బాధేస్తుంది. రెడ్డి కులాల్లో సీఎంను పొగుడుతారు. కానీ కాపులు నన్ను తిడుతున్నారు. నేను కాపు కులంలో పుట్టినా.. అన్ని కులాల కోసం పోరాడుతున్నాను. అన్ని కులాల్లో వెనకబాటు తనాన్ని పోగొట్టడమే నా లక్ష్యం.
చనిపోయిన తర్వాత విగ్రహాలు పెట్టడం ఎందుకు.. బతికి ఉన్నప్పుడే విలువ ఇవ్వండి. నిజంగా సీఎం మహానుభావుడు అయితే నేను అస్త్ర సన్యాసం తీసుకుంటాను. నాకు డబ్బుల మీద వ్యామోహం లేదు. ఎందుకంటే నేను ఒక్కో సినిమాకు రోజుకు రూ.2కోట్లు తీసుకుంటాను.
అలాంటప్పుడు నాకు డబ్బులు ఎందుకు. నిజంగా ప్రజల కోసం పని చేసేది మా జనసేన పార్టీ. కాబట్టి ఒక కులం కోసం పనిచేయడం నా ఉద్దేశం కాదు. యువత కులాల ఉచ్చులో పడకూడదు అంటూ తెలిపారు పవన్ కల్యాణ్.