Pawan Kalyan : పోలీసు అధికారులు మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలుసుకోండి.!
NQ Staff - October 16, 2022 / 04:54 PM IST

Pawan Kalyan : ‘అప్పట్లో టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం.. ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం.. ఇలా ప్రభుత్వాలు మారతాయి. మాతో కూడా మీరు కలిసి పని చేయాల్సి రావొచ్చు. మీరు పనిచేయాల్సింది పార్టీల కోసం కాదు, ప్రజల కోసం. కొందరు పోలీస్ అధికారుల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నా.. మీరు ఎవరి కోసం పని చేస్తున్నారో, వాళ్ళు ప్రతిపక్షంలో వున్నప్పుడు మీ మీద నమ్మకం లేదని అన్నారు..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర పోలీసుల్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ‘ఆంధ్రప్రదేశ్ పోలీసులపై మాకు నమ్మకం లేదు..’ అంటూ పదే పదే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
‘ప్రభుత్వాలు మారతాయ్.. మీరు మాత్రం 35 ఏళ్ళు సర్వీసులో వుంటారు.. ఆ బాధ్యత మీరు గుర్తెరగండి.. ప్రజల తరఫున నిలబడండి. మాకేమీ మీరు ఫేవర్ చేయాల్సిన పనిలేదు. మా హక్కులకు మీరు అడ్డం పడకపోతే అదే చాలు..’ అని పోలీసుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేస్తూనే, గతంలో జరిగిన విషయాల గురించి ప్రస్తావించారు. వ్యవస్థల్ని గౌరవిస్తాం.. చట్టాల్ని అనుసరిస్తాం..
‘మేం మీలాగా చట్టాల్ని ఉల్లంఘించం. మేం చట్టాల్ని గౌరవిస్తాం.
మేం చిన్నమనుషులం.. ప్రజాస్వామ్యయుతంగానే పోరాటం చేస్తాం.. అనుకోని ఘటనలు జరిగినప్పుడు హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. అలా పెట్టాల్సి వస్తే, మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి.?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేనాని విమర్శలు గుప్పించారు.
‘వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే, ఆ కేసులో ఇప్పటికీ ఎలాంటి పురోగతీ లేదు.. మా మీద హత్యాయత్నం కేసులు పెట్టి మీరు ఏం సాధిస్తారు.?’ అని వైసీపీ ప్రభుత్వాన్ని జనసేనాని ప్రశ్నించడం గమనార్హం. ‘బదులు తీర్చుకుంటాం.. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం..’ అంటూ విశాఖ పర్యటనలో జనసేనపై వైసీపీ సర్కారు జులుంపై జనసేనాని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గత ప్రభుత్వమూ మా మీద జులుం ప్రదర్శించింది.. చివరికి ఏమయ్యింది.? అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అధికారంలో వున్నోళ్ళు తెలుసుకోవాలని జనసేనాని అన్నారు.