Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పవర్ ఫుల్ నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీని ముట్టడించి తీరతామని ప్రకటించింది. జగన్ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని, నివార్ తుపానుతో నష్టపోయిన రైతులను ఇంతవరకూ ఆదుకోలేదని విమర్శించింది. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే దమ్మూ ధైర్యం వైఎస్సార్సీపీకి లేవని ఎద్దేవా చేసింది. నిన్న (శనివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో రైతుల పంట నష్టం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది. అపొజిషన్ పార్టీలపై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామ వాలంటీర్లను పూర్తిగా పొలిటికల్ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ధ్వజమెత్తింది. ఈ మేరకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నిన్న గుంటూరులో మాట్లాడారు.
గతంలోనే..
నివర్ తుపాను కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వకపోతే శాసన సభను ముట్టడించేందుకు కూడా వెనకాడబోమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే కృష్ణా జిల్లా పర్యటనలో జగన్ సర్కారును హెచ్చరించిన విషయం విధితమే. ఇప్పుడు మళ్లీ అదే మాటను ఆయన పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. దీన్నిబట్టి త్వరలో పవన్ కళ్యాణ్ ఈ సంచలన కార్యక్రమానికి ఏర్పాట్లుచేస్తున్నట్లు భావించొచ్చు. ఇప్పటివరకూ జరిగిన మూడు దశల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ సగటున 20 శాతానికి పైగా ఓట్లను కైవసం చేసుకున్నట్లు నేతలిద్దరూ(పవన్ కళ్యాణ్, మనోహర్) ఇప్పటికే ప్రకటించారు. ఈ ఉత్సాహంతోనే మరోసారి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు.

దిగొస్తుందా?: Pawan Kalyan
జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండు నెలల కిందట కృష్ణా జిల్లాలో పర్యటించి స్థానిక మంత్రులిద్దర్ని(నానీలని) టార్గెట్ చేశారు. జగన్ గవర్నమెంట్ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో అదే రోజు రాత్రి వైఎస్సార్సీపీ సర్కారు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేయటం గమనార్హం. అఫ్ కోర్స్ ప్రభుత్వం అంతకుముందే ఈ నిర్ణయం తీసుకున్నా సరిగ్గా అదే రోజు రిలీజ్ చేయటం వల్ల ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ కి దక్కిందనే టాక్ నడిచింది. మరి, ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం దిగొచ్చి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తుందా లేదా అనేది చూడాలి. అసెంబ్లీ ముట్టడి అనేది రాజకీయంగా పెద్ద నిర్ణయమనే చెప్పుకోవాలి.