Pawan Kalyan: అక్కని గెలిపించలేకపోయిన తమ్ముడు

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి కత్తి రత్నప్రభ ఓడిపోవటం వందకు రెండు వందల శాతం ఖాయమైపోయింది. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా అధికార పార్టీ వైఎస్సార్సీపీకి అసలు పోటీయే ఇవ్వలేకపోయాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉందని చెప్పొచ్చు. ఆ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మికి భారీగానే ఓట్లు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి మరోసారి డిపాజిట్ కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. తిరుపతి ఉపఎన్నిక పూర్తి ఫలితం ఇంకా వెల్లడి కానప్పటికీ రూలింగ్ పార్టీ క్యాండేట్ డాక్టర్ గురుమూర్తి గెలవటం లాంఛనమే అని తొలి నుంచీ చెబుతున్నట్లే జరుగుతోంది. మొన్నటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ‘పవర్’ ఏదీ?..

జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభావం చూపలేకపోయారు. ఒక్క రోజే ప్రచారం నిర్వహించిన ఆయన ఆ తర్వాత తన సినిమా ‘వకీల్ సాబ్’ ప్రిరిలీజ్ వేడుక, అనంతరం కరోనా పాజిటివ్ కారణంగా మరోసారి క్యాంపెయిన్ కి వెళ్లలేకపోయారు. కానీ.. ఎలక్షన్ ప్రచారం సందర్భంగా కత్తి రత్నప్రభ చేసిన ఒక కామెంట్ చాలా ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది. ‘నా తమ్ముడు పవన్ కళ్యాణ్ నన్ను గెలిపిస్తాడు’’ అని ఆమె అన్న మాట వాస్తవ రూపం దాల్చలేదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అత్యున్నత హోదాలో పనిచేసిన రత్న ప్రభ ఒక ఎంపీ స్థానానికి పోటీ చేసి ఈ స్థాయిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవటం ఆమె కెరీర్ కి మాయని మచ్చ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ మరీ నేలబారుగా వ్యవహరించిందనే విమర్శలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ మూవీ ‘వకీల్ సాబ్’కి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వకపోవటం, బెనెఫిట్ షోలు వేసుకునే ఛాన్స్ లేకపోవటం వంటి అంశాలను కూడా కాషాయం పార్టీ ఒక అజెండాగా చేసుకోవటం వాళ్లను బాగా దెబ్బకొట్టిందనే విశ్లేషణలు వస్తున్నాయి.

‘బండి’కి బిగ్ షాక్..

తిరుపతి బైఎలక్షన్ ని పురస్కరించుకొని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చాలా అడ్వాన్స్ గా, అడ్డదిడ్డంగా చేసిన ఒక వ్యాఖ్య ఆ పార్టీకి తీవ్రంగా నష్టం చేకూర్చిందనే చెప్పాలి. బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని ఆయన అనటం వల్ల ఇప్పుడు ఎలాంటి ఫలితం వచ్చిందో కమలనాథులు ఆలోచించుకోవాలని ఓటర్లు హితవు పలుకుతున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే అది రాజకీయం కాదు అనే చక్కని మెసేజ్ ఇచ్చినట్లయిందని అంటున్నారు.

Advertisement