Pawan Kalyan : మనసులో ఉన్న ఫీలింగే మాట రూపంలో వస్తుందంటారు. దీనికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా అతీతం కాకపోవచ్చు. చాలా మంది లోపల ఒకటి ఉంచుకొని బయటికి ఇంకొకటి చెబుతుంటారు. కానీ.. ఆయన అలాంటి వ్యక్తి కాదనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన విషయంలో సోము వీర్రాజు ఇప్పటికి రెండు సార్లు పొరపాటుగానో గ్రహపాటుగానో గందరగోళపరిచే కామెంట్లు చేశారు. ఫలితంగా బీజేపీ-జనసేన పొత్తుకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోంది.
ఇప్పుడేంటి?..
ఏపీలో బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని సోము వీర్రాజు గురువారం రోజు ఎక్కడో తొందరపడి అనటం పట్ల జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఆ కమలనాథుడి పేరు చెబితేనే వాళ్లు మండిపడుతున్నారు. బీజేపీ సహకారంతో రాజకీయంగా బలపడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. పదవుల కోసం పార్టీ పెట్టలేదని చెప్పిన ఆయనే ఆ తర్వాత ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను పలు మార్లు వెలిబుచ్చారు.
దానికెసరు?: Pawan Kalyan
సీఎం కావాలనే కోరిక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తీరుతుందని పవర్ స్టార్ పగటి కలలు కంటుండగా మధ్యలో ‘బీసీ ముఖ్యమంత్రి’ అనే కార్డును ప్రయోగించి సోము వీర్రాజు దుమారం రేపారు. క్యాజువల్ గా అన్నారో కావాలనే అన్నారో తెలియదు గానీ ఆయన మాటలు మాత్రం జనసేనాధినేత అభిమానులకు, ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు తెగ కోపం తెప్పించాయి. అయినా వాళ్లు దాన్ని ప్రదర్శించకుండా సంయమనం పాటిస్తున్నారు. బీజేపీని బద్నాం చేయకుండా సైలెంటుగా వీర్రాజు వ్యవహార శైలి గురించి ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలని కసికసిగా అనుకుంటున్నాయి.

అప్పుడేంటి?..
గతంలో తిరుపతి బై ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థే పోటీలో ఉంటాడని ప్రకటించటం ద్వారా సోము వీర్రాజు జనసేనను ఇరకాటంలోకి నెట్టాడు. ఇప్పుడు ఇలా ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆయన తమ పార్టీ పేరు ప్రస్తావించి మరీ ప్రతి సందర్భంలో తీసేసినట్లు మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ పార్టీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమను సంప్రదించకుండా సోము వీర్రాజు ఏకపక్షంగా చేస్తున్న ఈ ప్రకటనలను ఆయన పర్సనల్ ఒపీనియన్ గా తీసుకోవాలో లేక పార్టీ స్టాండ్ గా పరిగణించాలో తెలియక జనసేన సతమతమవుతోంది. దీంతో ఇక లాభం లేదనుకొని ఈ విషయాన్ని నేరుగా బీజేపీ హైకమాండ్ వద్దకే తీసుకెళ్లి క్లారిటీ పొందాలని చూస్తోంది. ఇదిలాఉండగా అసలు తాను బీసీ ముఖ్యమంత్రి అనే మాటే అనలేదంటూ సోము వీర్రాజు నిన్న శుక్రవారం ప్లేటు ఫిరాయించటం కొసమెరుపు.