KCR-Chandra Babu: ఇద్దరు చంద్రులూ బాగుండాలి..

KCR-Chandra Babu ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబుకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మంగళవారం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, ప్రజాజీవితంలో తనదైన స్థానం కలిగిన చంద్రబాబు జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉండేలా ఆశీర్వదించమని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నట్లు పవర్ స్టార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతకుముందు.. తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాన్ ఆకాంక్షించారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ కి కొవిడ్-19 పాజిటివ్ నిర్థారణ అయినట్లు తెలిసింది. వారు సత్వరం కోలుకోవాలని, మళ్లీ ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నం కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. కేసీఆర్ కి కరోనా స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందీ లేదని డాక్టర్లు చెప్పటం తెలంగాణ ప్రజలందరికీ ఊరట కలిగిస్తోంది’’ అంటూ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

 

మన్మోహన్ సింగ్ కూడా..

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా కారోనా బారినపడ్డారని, ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరి  చికిత్స పొందుతున్నారని తనకి సమాచారం అందినట్లు పవర్ స్టార్ చెప్పారు. ఒక ఆర్థికవేత్తగా, దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన మన్మోహన్ సింగ్ ఈ వ్యాధి నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావాలని భగవంతుణ్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ కి సైతం  కరోనా సోకగా ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ పొందుతున్నారు. చాలా వరకు కోలుకున్నారు.

ఏపీ సర్కార్ పై సీరియస్

కరోనా వైరస్ ఈ రకంగా విచ్చలవిడిగా వ్యాపిస్తుంటే ఏపీ ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని ప్రయత్నిస్తుండటం మూర్ఖత్వమేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎగ్జామ్స్ వల్ల లక్షలాది మంది విద్యార్థులతోపాటు వారి కుటుంబాల్ని కొవిడ్-19 ముప్పులోకి నెట్టినట్లేనని ఆందోళన వెలిబుచ్చారు. సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసి, అందర్నీ పై తరగతులకి ప్రమోట్ చేస్తే ఏపీ సర్కార్ ఎందుకు ఇంత మొండి పట్టుదలకు పోతోందని నిలదీశారు. వెంటనే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి వ్యాధి లక్షణాలూ చూపకుండా కరోనా వైరస్ మానవాళిపై దాడి చేస్తుంటే స్టూడెంట్స్ కి క్లాసులు, ఎగ్జామ్స్ పెడతామని చెబుతున్న పాలకులకు ప్రజల యోగక్షేమాల పైన, ఆరోగ్యం పైన ఏమాత్రం బాధ్యత లేకపోవటమే అవుతుందని జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విమర్శించారు.

Advertisement