Paritala: పరిటాల రవీంద్ర.. మళ్లీ కత్తిపట్టాడు..

Paritala ఎప్పుడో చనిపోయిన పరిటాల రవీంద్ర మళ్లీ కత్తిపట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆ సీనియర్ పరిటాల రవీంద్ర గురించి కాదు. ఆయన మనవడు జూనియర్ పరిటాల రవీంద్ర గురించి. సీనియర్ పరిటాల రవీంద్ర కొడుకు పరిటాల శ్రీరామ్జ్ఞాన దంపతులకు 2020 నవంబర్ 6న బాబు పుట్టాడు. అతనికి 2021 జనవరి 20వ తేదీన నామకరణ మహోత్సవం జరిపారు. పరిటాల శ్రీరామ్ తన తండ్రి పరిటాల రవీంద్ర పేరునే తన కొడుక్కి పెట్టాడు. ఇవాళ శుక్రవారం అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. అందులో బుల్లి పరిటాల.. బుక్స్, డబ్బులు, బంగారం, పండ్లు తదితర వస్తువులేవీ పట్టుకోకుండా కత్తి పట్టుకోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో పరిటాల రవీంద్ర మళ్లీ మారణాయుధం పట్టాడనే ప్రచారం మొదలైంది.

కేరాఫ్.. ఫ్యాక్షన్..

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పరిటాల రవీంద్ర పై ఫ్యాక్షన్ ముద్ర బలంగా ఉండేది. అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చాక దాన్ని చెరిపేసుకునేందుకు, ప్రజలను ముఠా గొడవలకి దూరంగా ఉంచేందుకు, డెవల్మెంట్ బాట పట్టించేందుకు ఎంతో పాటుపడ్డారు. పరిటాల రవీంద్ర తండ్రి, సోదరుడు, చివరికి ఆయన సైతం ప్రత్యర్థుల చేతిలో ఘోరంగా హత్యకు గురయ్యారు. సీనియర్ పరిటాల రవీంద్ర తన తండ్రి పేరు శ్రీరాములునే తన కొడుక్కి శ్రీరామ్ గా పెట్టారు. జూనియర్ పరిటాల శ్రీరామ్ ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నాడు. ఆ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి. రెండు (రాప్తాడు, ధర్మవరం) నియోజకవర్గాల బాధ్యతలను సైతం చూస్తున్నాడు. పరిటాల శ్రీరామ్ కూడా ఆవేశపరుడే అయినా గతంలో తన తండ్రి, తాతల మాదిరి ఫ్యాక్షన్ పాలిటిక్స్ జోలికి పోవట్లేదు. ప్రస్తుతం దానికి అనుకూల పరిస్థితులు కూడా లేవు.

ఫొటోలు.. వైరల్..

ఈ రోజు జరిగిన జూనియర్ పరిటాల రవీంద్ర అన్నప్రాసన కార్యక్రమానికి పరిటాల శ్రీరామ్ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ శుభకార్యంలో జూనియర్ పరిటాల రవీంద్ర తన తాత, ముత్తాల వారసత్వానికి అద్దంపట్టేలా కత్తి పట్టడం వార్తల్లోకెక్కింది. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ‘పరిటాల నెత్తురు కదా. కుతకుతలాడుతూ ఉంటుంది’ అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీత గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె పాలిటిక్స్ నుంచి రిటైర్ అయినట్లున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడు పరిటాల శ్రీరామ్ ని రాప్తాడు సెగ్మెంట్ నుంచి పోటీకి నిలబెట్టారు. కానీ.. అతను వైఎస్సార్సీపీ క్యాండేట్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపాయాడు.

Advertisement