Tdp-Bjp : పనబాక లక్ష్మి, రత్నప్రభ.. ఎన్నికల కమిషన్ కి వెళ్లండమ్మా..

Tdp-Bjp ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో నిలిచిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి, బీజేపీ క్యాండేట్ కె.రత్నప్రభలకు ఏపీ హైకోర్టులో ఇవాళ శుక్రవారం చుక్కెదురైంది. వాళ్లిద్దరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. ఎన్నికల కమిషన్(ఈసీ)లో ఫిర్యాదు చేయాలని సూచించింది. ‘‘బై ఎలక్షన్ లో అక్రమాలు జరిగాయని ఆధారాలు చూపిస్తున్నారు సరే. కానీ వాటిని పరిశీలించేందుకు ఈసీ ఉండగా మేం జోక్యం చేసుకోలేం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో వాళ్లిద్దరు ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఏమేమి కోరారు?..

తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఈ నెల 17న జరిగిన ఉపఎన్నిక పోలింగ్ లో అక్రమాలు జరిగినందున రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశించాలని టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఏకంగా బై ఎలక్షన్ నే రద్దు చేయాలని బీజేపీ క్యాండేట్ కె.రత్నప్రభ అభ్యర్థించారు. ఎన్నికల ఫలితాలను వెల్లడించొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా అడిగారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఏం తీర్పు చెబుతుందా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు. ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుందో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు. దీనికితోడు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో లాక్డౌన్ పెడితే ఓట్ల కౌంటింగ్ ని వాయిదా వేస్తారనే ప్రచారం కూడా జరిగింది.

వేరే దారి లేదు..

టీడీపీ, బీజేపీ అభ్యర్థుల పిటిషన్లు ఈరోజు ఏపీ హైకోర్టులో తిరస్కరణకు గురికావటంతో వాళ్లకు ఇక అన్ని దారులూ మూసుకుపోయినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రేపు మే 1వ తేదీ. మే డే. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సెలవు దినం. ఎల్లుండే ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కాబట్టి వాళ్లిద్దరు ఎన్నికల కమిషన్ లో కంప్లైంట్ చేయటానికి తగిన సమయం లేదు. ఒక వేళ ఫిర్యాదు చేసినా ఈసీ సైతం వాటిని తోసిపుచ్చే అవకాశాలే ఎక్కువ. నిజంగా అక్రమాలు జరిగితే ఈసీ వెంటనే స్పందించేది. కాబట్టి పనబాక లక్ష్మి, కె.రత్నప్రభ కేవలం రాజకీయ ప్రచారం కోసం, విక్టరీ క్రెడిట్ ని వైఎస్సార్సీపీకి ఇవ్వటం ఇష్టంలేకే ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారని ఇట్టే తెలిసిపోతోంది. అయినా వాళ్లిద్దరూ ఓడిపోబోతున్నారని నిన్న గురువారం ఎగ్జిట్ పోల్స్ చెప్పేయటం గమనార్హం.

Advertisement