Nimmagadda : నిమ్మగడ్డ మజాకా, భయపెట్టి మరీ వాళ్ళు తన దారిలోకి వచ్చేలా చేసుకున్నాడు ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లకు ఓ చిన్న ఝలక్ ఇచ్చి వారిని తన దారిలోకి వచ్చేలా చేసుకున్నారు. ద్వివేది, గిరిజా శంకర్ లను అభిశంసన చెయ్యాలని నిమ్మగడ్డ డివోపీటీ(dopt) కి ఫిర్యాదు చేశారని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ నిమ్మగడ్డ ద్వివేది, గిరిజాశంకర్ ల చేత నిర్బంధ పదవీ విరమణ చేయించాలని కూడా డివోపీటీ కి సిఫార్సు చేసినట్టు తాజాగా బయటపడింది. వీళ్లిద్దరిని పదవి కాలానికి ముందే విధుల నుంచి తొలగించాలని నిమ్మగడ్డ డివోపీటీ కి సిఫార్సు చేసినట్టు ఇప్పటివరకు ప్రచారం జరిగింది. కానీ వారిద్దరితో నిర్బంధ పదవీ విరమణ కూడా చేయించాలని నిమ్మగడ్డ ప్రతిపాదించారు.

అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సివిల్ సర్వీసు అధికారుల కదలికలను మొత్తం డివోపీటీ శ్రద్ధగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ ద్వివేది, గిరిజాశంకర్ లపై సంచలన ఆరోపణలు చేశారు. ఎలక్షన్ డ్యూటీ సక్రమంగా నిర్వర్తించకుండా పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తూ.. కావాలనే ఓటరు జాబితాను ప్రచురించకుండా.. భారత ప్రజాస్వామ్య పునాదుల్ని బలహీనం చేయడానికి ద్వివేదీ, గిరిజాశంకర్ ప్రయత్నిస్తున్నారని.. వీరిది క్షమించరాని నేరమని ఉద్ఘాటిస్తూ.. నిమ్మగడ్డ డీవోపీటికి చర్యలకు సిఫార్సు చేశారు. వారిపై అభిశంసన, నిర్బంధ పదవీ విరమణ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన తన సిఫార్సులో పేర్కొన్నారు. దీంతో ద్వివేది, గిరిజా శంకర్ లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రభుత్వం చెప్పినట్టుగా విని పదవులను కాల్పోతున్నామని వాపోయారు. అయితే వారిద్దరినీ పదవుల నుంచి తొలగించడానికి ఎన్నికల కమిషనర్ కి ఎటువంటి అధికారం లేదని రాష్ట్రప్రభుత్వం చెప్పుకొచ్చింది.

ఈ నేపథ్యంలోనే నిమ్మగడ్డ మాట్లాడుతూ.. ఎన్నికల విధులలో సమర్థంగా పని చేస్తే వారిద్దరిపై కూడా లేఖను వెనక్కి తీసుకునే అంశంపై ఆలోచిస్తామని చెప్పారు. అయితే నిమ్మగడ్డ చెప్పినట్లుగానే ఈ ఇద్దరు అధికారులు ఎన్నికల నిర్వహణ డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తున్నారు. దీంతో నిమ్మగడ్డ నిర్బంధ పదవీ విరమణ సిఫార్సును వెనక్కి తీసుకుంటున్నామని డివోపీటీ కి లేఖ రాశారు. నిజానికి ద్వివేది కి ఇంకా 3 సంవత్సరాల పదవీ కాలం ఉంది. గిరిజా శంకర్ కి మూడేళ్ల కంటే ఎక్కువగానే సర్వీస్ ఉంది. అందుకే నిమ్మగడ్డకు వ్యతిరేకంగా వ్యవహరించకుండా తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి ద్వివేది, గిరిజాశంకర్ లు ఆసక్తిని కనబరిచారు. ఏది ఏమైనా నిమ్మగడ్డ భయపెట్టి మరీ వాళ్ళు తన దారిలోకి వచ్చేలా చేసుకున్నారు.

Advertisement