Nimmagadda : స్పీడ్ ‘‘బ్రేకింగ్’’ న్యూస్ : నిమ్మగడ్డా.. నిమ్మలంపడు.. నాలుగు రోజులాగు..

Nimmagadda : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఏపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పీడుకి ఏపీ హైకోర్టు కొంచెం బ్రేక్ వేసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తెర మీదికి తెచ్చిన ‘ఈ-వాచ్’ యాప్ ని ఈ నెల తొమ్మిదో తేదీ వరకు (అంటే వచ్చే గురువారం దాక) వాడొద్దని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నిమ్మగడ్డకు రాష్ట్ర హైకోర్టులో మరోసారి చుక్కెదురైనట్లయింది. గతంలో ఆయన జారీ చేసిన ఎలక్షన్ షెడ్యూల్ ని ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేసిన సంగతి తెలిసిందే.

4 రోజుల్లో..

ఫిర్యాదులు స్వీకరించేందుకు ఎస్ఈసీ తయారుచేయించియిన ‘ఈ-వాచ్’ యాప్ కి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) నుంచి సెక్యూరిటీ సర్టిఫికెట్ రాలేదు. దీంతో దీనిపై ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై ఇవాళ (శుక్రవారం) విచారణ జరిపిన జడ్జి ‘ఈ-వాచ్’ యాప్ కి సెక్యూరిటీ సర్టిఫికెట్ ఉందా అని ఎస్ఈసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ ఐదు రోజుల్లో సర్టిఫికెట్ తీసుకుంటామని చెప్పారు. అయితే.. అప్పటివరకు యాప్ ని వాడకుండా పక్కన పెట్టాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేశారు.

నిన్నే అప్లై: Nimmagadda

‘ఈ-వాచ్’ యాప్ కి సెక్యూరిటీ సర్టిఫికెట్ కోసం ఎస్ఈసీ నిన్న గురువారం దరఖాస్తు చేయగా అనుమతి ఇచ్చేందుకు ఐదు రోజులు పడుతుందని ఏపీటీస్ స్పష్టం చేసింది. సెక్యూరిటీ చెకింగ్ పూర్తికాకుండా యాప్ ని వాడటానికి వీల్లేదంటూ పిటిషనర్ తీవ్ర అభ్యంతరం చెప్పగా సంబంధిత పరిశీలన జరపాలంటూ హైకోర్టు ఏపీటీఎస్ కి సూచించింది.

Nimmagadda : high court break to nimmagadda speed
Nimmagadda : high court break to nimmagadda speed

యూపీ బాటలో..

ఇప్పటికే గవర్నమెంట్ రూపొందించిన యాప్ ఒకటి అందుబాటులో ఉండగా ఈ యాప్ ను ఎందుకు తయారుచేయించారని పిటిషనర్ ప్రశ్నించారు. ఎస్ఈసీ తరఫు న్యాయవాది బదులిస్తూ ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పర్మిషన్ తీసుకున్నామని చెప్పారు. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ఇలాగే ప్రత్యేకంగా యాప్ ను తయారు చేయించారని గుర్తుచేశారు.

వెలుగు చూడలే: Nimmagadda

మొన్న బుధవారం ఆవిష్కరించిన ‘ఈ-వాచ్’ యాప్ ను నిన్న గురువారం నుంచి గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పినా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. దీంతో దీన్ని అన్ని కోణాల్లో పరిశీలన జరిపేందుకు ఏపీటీఎస్ కి పంపారు. ఈ లోపు హైకోర్టు కూడా యాప్ వాడకానికి బ్రేక్ వేయటంతో అప్పటిదాక ఆగకతప్పదు.

Advertisement