Nara Lokesh In Delhi Fearing Arrest : అరెస్టు భయంతోనే హస్తినకు నారాలోకేష్.. తండ్రి జైలులో ఉంటే అక్కడెవరితో మంతనాలు..?
NQ Staff - September 22, 2023 / 07:25 PM IST

Nara Lokesh In Delhi Fearing Arrest :
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. మొన్నటివరకు యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్ తండ్రి జైలుకెళ్లిన 3 రోజుల్లోనే ఢిల్లీకి పయనమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా తమ పార్టీ ఎంపీలు, లీడర్లతో కలిసి చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఈ విషయంలో కేంద్రం పెద్దలు జోక్యం చేసుకోవాలని తమ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఆయనకు ఎవరి అపాయింట్ మెంట్ లభించలేదు.
తన తండ్రిని జైలు నుంచి విడిపించడానికి నారా లోకేష్ చేపట్టిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టినా ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు? ఎవరితో మంతనాలు జరుపుతున్నారు? తండ్రి కోసం సుప్రీం కోర్టు లాయర్లతో మాట్లాడుతున్నారని కథనాలు వస్తున్నా ఇంకెన్నీ రోజులు చేస్తారు? బాబు అరెస్టై ఇప్పటికే 14 రోజులు గడిచాయి. దేశంలోనే టాప్ లాయర్లుగా పేరు గాంచిన సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే బాబు తరఫున ఏసీబీ కోర్టులో వాదించినా పెద్దగా ఫలితం లేకుండాపోయింది. ఏపీ సీఐడీ తరఫున వాదించే లాయర్ల ముందు వీరు తేలిపోతున్నారు.
దీనికి తోడు ఏపీ సీఐడీ అధికారుల లిస్టులో తర్వాతి పేరు నారా లోకేష్ దే ఉందని తెలుస్తోంది. ఎప్పుడైనా లోకేష్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేయొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ స్కాం జరిగిన టైంలో లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నారు. దీంతో ఈ స్కాంలో ఆయన ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల టీడీపీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు కూడా లోకేష్ అరెస్టుపై కూడా ఉండొచ్చని జోస్యం చెప్పారు.
దీనిని బట్టి చూస్తే అరెస్టు భయంతో నారా లోకేష్ ఢిల్లీలో మకాం వేశాడని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. తండ్రిని కాపాడటం పక్కన బెడితే తనను తాను రక్షించుకునేందుకు లోకేష్ ఢిల్లీలో సుప్రీం లాయర్లతో ముందుగానే మంతనాలు చేస్తున్నారని కూడా ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే నిజం కాకపోతే లోకేష్ ఇంకా ఎందుకు ఢిల్లీలో ఉన్నారు. పార్లమెంట్ సెషన్స్ కూడా అయిపోయాయి. పోనీ కేంద్రమంత్రులతో ఏమైనా చర్చిస్తున్నారా? అంటే దానికి సంబంధించి ఎలాంటి లీకులు రాలేదు.
ఎన్నికల టైంలో పార్టీ పగ్గాలు చేపట్టి ముందుండి నడిపించడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపకుండా హస్తినలో కూర్చుంటే ఏం వస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. రాజమండ్రిలో ఉండే మంతనాలు చేయొచ్చు కదా అని కూడా తెలుగు తమ్ముళ్లు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాబు జైలులో, లోకేష్ ఢిల్లీలో ఉండటంతో పార్టీని నడిపే వారు లేక కేడర్ అంతా అయోమయంలో ఉంది. ఇక నారా కుటుంబం రాజమండ్రికి షిఫ్ట్ అయ్యారు.
వారంతా బాబు ఎప్పుడు జైలు నుంచి విడుదల అవుతారా? అని ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ నాయకత్వాన్ని తెలుగు తమ్ముళ్లు అంగీకరించే పరిస్థితి లేదు. ఎన్నో సార్లు కేసుల నుంచి బయటపడిన బాబు ఈ కేసు నుంచి ఎందుకు బయటకు రావడం లేదనే పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.