MP Raghurama Krishnamraju : రఘురామ కృష్ణంరాజు సర్వే.. 2024లోవార్ వన్‌సైడ్ అని తేల్చేసిన రెబెల్ ఎంపీ
NQ Staff - August 23, 2022 / 06:50 PM IST

MP Raghurama Krishnamraju : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త కొత్త సర్వేలు పుట్టుకొస్తున్నాయి. జాతీయ మీడియా సంస్తలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇండియా టీవీ, ఇండియా టుడే, టైమ్స్ నౌ సర్వేలు- మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. తాజాగా వైఎస్ఆర్సీపీకే చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా సర్వేను విడుదల చేశారు.
టీడీపీ వైపు..
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తేల్చేశారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ఈ సర్వేల సందడి మొదలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ మీడియా సంస్థల అంచనాలకు భిన్నంగా రఘురామ సర్వే ఉండటం ఆసక్తిగా మారింది. ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీ 93 స్థానాల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని తేలిందని అన్నారు. ఇక నువ్వా నేనా అన్నట్టు ఉన్న వాటిలో సగం స్థానాల్లో గెలిచినా.. ఆ పార్టీకి 127 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

MP Raghurama Krishnamraju Released Survey
ఈ మేరకు ఢిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసిపి కచ్చితంగా గెలిచే స్థానాలు 7 నుంచి 8 ఉన్నాయని, మరో మూడు నుంచి నాలుగు స్థానాల్లో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని అన్నారు. ఇంగ్లీషు ఛానెల్స్ సర్వేలను చూసి తమ పార్టీ నాయకులు మురిసిపోతూ కూర్చుంటే.. పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో సర్వే ఫలితాలను ఆయన చదివి వినిపించారు.
రఘురామ నిర్వహించిన సర్వే ప్రకారం.. 2024 నాటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. 93 అసెంబ్లీ స్థానాలతో విజయఢంకా మోగిస్తుంది. దీనితో పాటు ఇంకో 30 నియోజకవర్గాల్లో టీడీపీ-వైఎస్ఆర్సీపీ మధ్య టైట్ ఫైట్ ఉంటుంది. అందులో కనీసం 15 నుంచి 20 సీట్లు టీడీపీ వైపే మొగ్గు చూపొచ్చు. ఈ 30 సీట్లల్లో అతి తక్కువ మెజారిటీతో అయినా సరే.. టీడీపీ అభ్యర్థులే గెలుస్తారని తేలింది. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే టీడీపీ 127 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది.
వైఎస్ఆర్సీపీ విజయం సాధించే స్థానాల సంఖ్య 50కి దాటదని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. వైసీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలుస్తుందని పేర్కొన్నారు. వైసీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 10లోపే ఉన్నాయనీ వివరించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ప్రభుత్వం అధికంగా ఉంటుందని రఘురామ అంచనా వేశారు.