RaghuRama : మళ్లీ అరెస్ట్ తప్పదనే.. ఢిల్లీకి జంప్?..

RaghuRama: నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు నిన్న బుధవారం ఎవరూ ఊహించని విధంగా ఢిల్లీకి జంప్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసమే వెళ్లారని పైకి చెబుతున్నా జగన్ సర్కారు తనను మళ్లీ ఎక్కడ అరెస్ట్ చేస్తుందోనన్న భయంతోనే దేశ రాజధానికి చెక్కేశారని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఆయన అక్కడికి చేరుకోవటం కాస్త విడ్డూరమే. పైగా వైద్య రంగంలో హైదరాబాద్ చెప్పుకోదగ్గ ప్రాంతం అయినప్పటికీ రఘురామ ఢిల్లీకి పయనం కావటం వ్యూహాత్మకమే తప్ప అత్యవసరం మాత్రం కాదని చెబుతున్నారు. సహజంగా సైనిక ఆస్పత్రిలో అత్యుత్తమ సౌకర్యాలు ఉంటాయి. కొవిడ్ సోకుతుందనే ఆందోళన కూడా చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆర్మీ హాస్పిటల్ ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో జన సంచారం చాలా తక్కువ. ఇవన్నీ కాదని సదరు ఎంపీ గుట్టుచప్పుడు కాకుండా హస్తినకి ప్రత్యేక విమానంలో బయల్దేరటం ఆయనలోని పిరికితనానికి నిదర్శనం అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

mp raghurama

అనుకున్నట్లుగానే..

మనం అనుకుంటున్నట్లుగానే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో పడకలన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోవటం వల్ల రఘురామకృష్ణరాజుకు కనీసం ఒక్క బెడ్ కూడా దొరకలేదు. దీంతో ఆయన ఇంటికెళ్లిపోయాడు. రఘురామ కోసం ఒక ప్రత్యేక పడకను ఏర్పాటుచేయటానికి తమకు కొంత సమయం కావాలని ఎయిమ్స్ వాళ్లు కోరారు. ముందుగానే అక్కడ బెడ్లు ఖాళీగా ఉన్నాయా లేదా అని తెలుసుకొని వెళ్లొచ్చు కదా. సైనిక ఆస్పత్రి డాక్టర్లు ఎంపీకి మరికొద్ది రోజులు వైద్యం అందించాల్సిన అవసరముందని చెప్పారు తప్ప తమ దగ్గర బెటర్ ట్రీట్మెంట్ లేదని గానీ ఎయిమ్స్ కి తీసుకెళ్లాలని గానీ అనలేదు.

mp raghurama

సుప్రీంకోర్టు కూడా చెప్పలే..

తెలుగు రాష్ట్రాల్లో ఉండటం రఘురామకృష్ణరాజుకు శ్రేయస్కరం కాదని, అందువల్ల ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చాలని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు. అయినా ఆయన హస్తినకు పలాయనం చిత్తగించటం భిన్న వాదనలకు తావిస్తోంది. రఘురామ ఎంపీ కాబట్టి ఢిల్లీలో ఉంటే లోక్ సభ స్పీకర్ రక్షణ సత్వరం దొరుకుతుందని, అక్కడైతే ఏపీ పోలీసులు అంత తేలిగ్గా అదుపులోకి తీసుకోలేరని భావించి ఉండొచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రఘురామ ఆర్మీ హాస్పిటల్ నుంచి ఎప్పుడు విడుదలైనా వెంటనే గుంటూరుకు పట్టుకు రావాలని సీఐడీ పోలీసులు స్కెచ్ వేశారని, అందుకే సికింద్రాబాద్ సైనిక ఆస్పత్రి వద్ద తచ్చాడుతున్నారని పచ్చ మీడియా అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలా చేయటం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించటంగానే పరిగణించాల్సి ఉంటుందంటూ రఘురామ తరఫు న్యాయవాదులు గుంటూరు కోర్టులో పిటిషన్ వేసి ముందుగానే పోలీసుల ముందరి కాళ్లకు బంధం వేసినట్లు ఎల్లో మీడియా కథనాలు రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి పోతే ఇలాంటి గొడవలేవీ ఉండవనే ఉద్దేశంతో ఎంపీ చిన్నగా జారుకున్నారని ప్రచారం జరుగుతోంది.