Balakrishna: గంధం చంద్రుడికి.. బాలకృష్ణ ఫోన్..

Balakrishna గంధం చంద్రుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కలెక్టర్. మొన్నీమధ్య వార్తల్లో నిలిచాడు. అతని పై అదే జిల్లాకు చెందిన ధర్మవరం శాసన సభ్యుడు (వైఎస్సార్సీపీ) కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డాడు. మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని కలెక్టర్ గంధం చంద్రుడు ఏమాత్రం లెక్కచేయట్లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతనొక పనికి మాలిన ఐఏఎస్ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాళ్లిద్దరి మధ్య వాస్తవానికి ఏం జరిగిందో తెలియదు గానీ గంధం చంద్రుడు ఒక దళిత వర్గానికి చెందిన జిల్లా పాలనాధికారి అని సమాచారం. చాలా కష్టపడి పైకొచ్చాడని చెబుతారు. చిన్నతనంలో అంటరానితనాన్ని కూడా ఎదుర్కొన్నాడని తెలిసింది. ఆ స్థితి నుంచి అత్యున్నత స్థాయికి వచ్చాడు కాబట్టే అంబేద్కర్ మార్గంలో నడుస్తాడని అంటుంటారు. గంధం చంద్రుడి పై కేతిరెడ్డి ఇలా విమర్శలు చేయటాన్ని అప్పట్లో దళిత సంఘాలు ఖండించాయి. శాసన సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మొత్తానికి ఆ సమస్య ఏదో ఒక విధంగా సద్దుమణిగింది.

బాలయ్య ఆరా.. దాని గురించి కాదు..

అదే జిల్లాకు చెందిన హిందూపురం ఎమ్మెల్యే(టీడీపీ), టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లేటెస్టుగా ఆ గంధం చంద్రుడికి ఫోన్ చేశారు. గతంలో జరిగిన ఈ గొడవ గురించి ఏమీ ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గం పరిధిలోని పరిస్థితి గురించి తెలుసుకోవటానికి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించటానికి బాలయ్య బాబు కలెక్టర్ కి కాల్ చేశారు. కొవిడ్-19 పాజిటివ్ అని తేలినవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, హిందూపురం హాస్పిటల్ లో అన్ని వసతులు కల్పించాలని కోరారు.

ఆసుపత్రి బాధ్యుడికి కూడా..

స్థానిక శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ గంధం చంద్రుడితోపాటు హిందూపురం ఆస్పత్రి బాధ్యుడు (సూపరింటెండెంట్) దివాకర్ బాబుతో కూడా ఫోన్ లో మాట్లాడి ప్రజల తరఫున పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రోగులకు పక్కాగా వైద్యం అందించాలని చెప్పారు. జిల్లా వైద్యారోగ్య అధికారి(డీఎంహెచ్ఓ)కి సైతం కాల్ చేసి పరిస్థితిని సమీక్షించారు. కొవిడ్-19 వైరస్ బారినపడకుండా ప్రజలు ప్రతిఒక్కరూ ఫేస్ మాస్కులు పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని, ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలని, సురక్షితంగా ఉండాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రిక్వెస్ట్ చేశారు.

Advertisement