పేకాట ఉచ్చులో మరింత చిక్కుకుపోతున్న వైసీపీ మంత్రి
Surya - November 19, 2020 / 06:30 PM IST

వైసీపీ నేత, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చుట్టూ వివాదాల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలుమార్లు వివాదాలతో వార్తల్లోకెక్కిన ఆయన మరోసారి వార్తలో నిలిచారు. ఆయన మీదున్న పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారనే కేసులో సీబీఐ దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించడానికి హైకోర్టు అంగీకరించింది. 2019 ఆగష్టులో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని మంత్రి గుమ్మనూరు జయరాం సొంత గ్రామమైన గుమ్మనూరులో పేకాట ఆడుతూ 33 మంది పోలీసులకు చిక్కారు. శిబిరం మీద పోలీసులు రైడ్ చేయగానే అందులోని వ్యక్తులు పోలీసులు మీద ఎదురుదాడికి దిగారు. కానీ ఎలాగో పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు.

Minister Gummanuru Jayaram facing troubles
మంత్రి అండదండలు ఉండటంతోనే సదరు వ్యక్తులు పోలీసుల మీద అంత ధైర్యంగా దాడి చేయగలిగారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పైగా అరెస్టైన వారిలో కొందరు మంత్రిగారి కుటుంబ సభ్యులేననే ఆరోపణలు కూడ వచ్చాయి. ఆ టైంలో పోలీసులు కేసులు నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత ఆ కేసులు ఏమయ్యాయి, అరెస్టయినవారు ఎలా బయటికొచ్చారు అనేది ఎవ్వరికీ తెలీదు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ అంశాన్ని అంత ఈజీగా వదిలేయలేదు. అవకాశం దొరికినప్పుడల్లా లేవనెత్తి రచ్చ చేస్తూ వచ్చాయి.
తాజాగా మంత్రి మీద సీబీఐ విచారణ జరపాలని హైకోర్టులో పిటిష దాఖలైంది. పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు దానిని విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్లో మంత్రిని ప్రతివాదిగా చేర్చారు పిటిషనర్. ఈ ఆరోపణలను మంత్రి జయరాం మొదటి నుండి ఖండిస్తూనే ఉన్నారు. పేకాట ఆశిబిరాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. అయినా వదలని విపక్షాలు వ్యవహారాన్ని కోర్టు వరకు లాగాయి. ఇప్పుడు మంత్రి తన నిజాయితీని కోర్టులో నిరూపించుకోవాల్సి వచ్చింది. జయరాం ఇచ్చే సమాధానాలతో కోర్టు సంతృప్తి చెందకపోతే కేసు సీబీఐ చేతికి వెళ్లిపోవడం ఖాయం. అప్పడు ఎదురయ్యే సమస్యలు ఇంకా కఠినంగా ఉంటాయి. ఇది చాలదన్నట్టు ఈమధ్య మంత్రి మీద ఈఎస్ఐ స్కాంలో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి నుండి ఖరీదైన బెంజ్ కారును బహుమతిగా తీసుకున్నారనే ఆరోపణలు లేచాయి.