పోలీసులపై లోకేష్ ఫైరింగ్ మామూలుగా లేదుగా..
Kondala Rao - December 19, 2020 / 03:44 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు తూటాల్లాంటి ట్వీట్లు వదిలారు. పోలీసులను టార్గెట్ చేసుకొని ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ఫైరింగ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ గా జగన్ పై చూపాల్సిన కోపాన్ని లోకేష్ పోలీసులపై చూపించారనే టాక్ వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ గూండాల చేతిలో తన్నులు తిన్న పోలీసులు.. పైకి మాత్రం ఏమీ ఎరగనట్లు నటిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సిగ్గూ శరం లేదా..
ఏపీ పోలీసులపై నారా లోకేష్ శనివారం తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులకు సిగ్గూ శరం లేదా అంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీవాళ్లు దాడి చేస్తే ఖండించటం పోలీసులకు చేతకావట్లేదని దెప్పిపొడిచారు. మసాజ్ చేయించుకున్నామంటూ మతిలేని మాటలు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ పరువు, మర్యాదను సీఎం జగన్ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టొద్దని హితవు పలికారు.
ఇంతలా దిగజారుతారా?
అధికార పార్టీ వైఎస్సార్సీపీని ప్రసన్నం చేసుకోవటానికి, వాళ్ల మెప్పు పొందటానికి కొంత మంది పోలీసులు తమ స్థాయిని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని, ఎంతకైనా దిగజారుతున్నారని లోకేష్ ఆరోపించారు. వైఎస్సార్సీపీ గూండాల బారి నుంచి తమనుతాము కాపాడుకోలేని పోలీసులు ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని ఆయన నిలదీశారు. నిజాలేంటో పోలీసులకు తెలిసినా కళ్లకు గంతలు కట్టుకొని, ఫ్యాక్ట్ చెక్ పేరిట తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు.
పోలీసును ఎవరు గాయపర్చారు?
‘‘విశాఖలో ఈరోజు జరిగిన తోపులాటలో పోలీసు గాయపడ్డారని చెబుతున్నారు. మరి, ఎవరు ఎటాక్ చేస్తే అతనికి గాయమైందో మీకు తెలియదా?. పోలీసు తనకు తానే గాయపర్చుకున్నాడా?. దాడి సమయంలో తీసిన వీడియోలేవి?. బాడీవేర్ వీడియోలు ఎలా మాయమయ్యాయి?. వాటిని బయట పెట్టే దమ్మూధైర్యం మీకు ఎలాగూ లేదు. అందుకే నేనే రిలీజ్ చేస్తున్నా. చూడండి’’ అని లోకేష్ ఓ వీడియోను తన ట్వీట్ కి జతచేశాడు.
తన్నులు తిని వైకాపా వాళ్ళతో మసాజ్ చేయించుకున్నాం అని చెప్పడానికి సిగ్గుగా లేదా? పోలీసు శాఖ ఆత్మగౌరవాన్ని @ysjagan కాళ్ల దగ్గర తాకట్టుపెట్టకండి.అధికార పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి కొంత మంది పోలీసులు పూర్తిగా దిగజారిపోతున్నారు.(1/4) pic.twitter.com/nTfLNtJAf4
— Lokesh Nara (@naralokesh) December 19, 2020
అసలేం జరిగింది?
విశాఖ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ విజయనిర్మల నాయకత్వంలో ఆ పార్టీ నేతలు శనివారం ‘‘మూడు రాజధానులు ముద్దు’’ పేరిట సిటీలో ర్యాలీ చేశారు. తర్వాత ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆఫీసు ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ లీడర్లు సీఐని నెట్టేయడంతో అతను ఆటోపై పడి తలకు దెబ్బతగిలింది. ఈ ఘటనను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులు ఖండించారు.