KTR: కేటీఆర్ గారూ.. ఆంధ్రా ప్రజలకు సాయం చేయండి..
Kondala Rao - April 26, 2021 / 07:29 PM IST

KTR: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కరోనా బారినపడ్డప్పటికీ హోం ఐసోలేషన్ లోనే ఉంటూ ఒక ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యతలను నెరవేరుస్తున్నారు. అవసరంలో ఉన్నవారికి సాయం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. తన పర్సనల్ ఆఫీస్ సిబ్బంది మీకు అండగా ఉంటారంటూ బాధితులకు హామీ ఇస్తున్నారు. మీ వివరాలు పంపితే మీకు కావాల్సిన హెల్ప్ అందిస్తామని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ కి తెలంగాణ రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రిక్వెస్టులు వస్తుండటం గమనార్హం. ఏపీలోని విజయవాడకు చెందిన ఒక యువతికి కొవిడ్-19 వైరస్ సోకింది. దీంతో ఆమె ట్రీట్మెంట్ కోసం ఓ హాస్పిటల్ లో చేరింది. కానీ అక్కడ అనుకున్నవిధంగా చికిత్స అందకపోవటంతో ఆమె సోదరుడు కేటీఆర్ ని ట్విట్టర్ లో సంప్రదించాడు.
రెమిడెసివిర్ డ్రగ్ కావాలి..
తన సోదరి ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ కి వివరించిన ఆ యువకుడు రెమిడెసివిర్ డ్రగ్ ఇప్పించాల్సిందిగా వేడుకున్నాడు. దీనికి వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. ‘‘తప్పకుండా సాయం చేస్తా మిత్రమా. ఆందోళన పడొద్దు. నా ఫ్రెండ్ మేకపాటి గౌతమ్ మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు’’ అని భరోసా ఇచ్చారు. కేటీఆర్ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ సంబంధిత వ్యక్తిని ఆదుకున్నారు. దీంతో బాధితుడు హర్షం వ్యక్తం చేశాడు. ఇద్దరు మంత్రులకూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపాడు. కేటీఆర్ యాక్షన్ కి నెటిజన్లు అద్భుతమైన రియాక్షన్ ఇస్తున్నారు. ‘‘అన్నా అంటే నేనున్నా’’ అంటూ మంత్రి ముందుకు వస్తున్నారని ఆనందం వెలిబుచ్చుతున్నారు. ఏపీ, తెలంగాణ అనే తేడా, భేద భావం చూపించట్లేదని, నిజమైన మానవత్వం ప్రదర్శిస్తున్నారని ప్రశంసిస్తున్నారు.
ఎన్నెన్నో విన్నపాలు..
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కి వివిధ వర్గాల నుంచి, విభిన్న ప్రాంతాల నుంచి విన్నపాలు వెల్లువలా వస్తున్నాయి. హాస్పిటల్స్ లో బెడ్లు కావాలని, ఆక్సీజన్ సిలిండర్ ఇప్పించండని, ప్లాస్మా అందించాలని, కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించాలని కోరుతున్నారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత గురించి ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాథమిక వైద్య కేంద్రాల్లో కొవిడ్-19 పరీక్షలు పెద్ద సంఖ్యలో చేయాలని అడుగుతున్నారు. వాటన్నింటికీ కేటీఆర్ ఓపిగ్గా బదులిస్తున్నారు. తద్వారా రియల్ లీడర్ అనిపించుకుంటున్నారు.