Tirupathi Elections: నోటాతో పోటీపడుతున్న నేషనల్ పార్టీలు..
Kondala Rao - March 31, 2021 / 06:45 PM IST

Tirupathi Elections తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నానీ తాజాగా స్పందించారు. ఒక నేషనల్ పార్టీ నోటాతో పోటీపడుతోందని ఎద్దేవా చేశారు. ఆయన పరోక్షంగా కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీని దెప్పిపొడిచారు. కానీ నోటాతో పోటీపడుతున్నది ఒక్క జాతీయ పార్టీ కాదు. రెండు. ఒకటి బీజేపీ కాగా రెండోది కాంగ్రెస్. ఎందుకంటే 2019లో జరిగిన జనరల్ ఎలక్షన్ లో తిరుపతి సెగ్మెంట్ లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రెండో స్థానంతో సరిపెట్టుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ రావుకి 7 లక్షల 22 వేల 877 ఓట్లు రాగా టీడీపీ క్యాండేట్ పనబాక లక్ష్మికి 4 లక్షల 94 వేల 501 ఓట్లు వచ్చాయి. ఇక ‘‘నన్ ఆఫ్ ది అబౌ’’ (ఎన్ఓటీఏ-నోటా) బటన్ ని 25 వేల 781 మంది నొక్కారు. దీంతో అది మూడో ప్లేస్ ని ఆక్రమించటం విశేషం.
నాలుగు, ఆరు స్థానాల్లో..
నాలుగో స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ (జాతీయ పార్టీ) అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కి పట్టుమని పాతిక వేల ఓట్లు కూడా రాలేదు. 24,039 ఓట్లు మాత్రమే పొందాడు. ఐదో స్థానంలో నిలిచిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) క్యాండేట్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు 20 వేల 971 ఓట్లు కైవసం చేసుకున్నారు. బీఎస్పీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవటం ఆయనకు కాస్త కలిసొచ్చింది. ఇక, మరో జాతీయ పార్టీ అయిన కమలం పార్టీ ఘోరాతి ఘోరంగా ఆరో స్థానానికి పడిపోయింది. ఆ పార్టీ అభ్యర్థి బొమ్మి శ్రీహరిరావు 16,125 ఓట్లు మాత్రమే రాల్చగలిగారు.
కొడాలి నానీ ఇంకా ఏమన్నారంటే..
వచ్చే నెలలో జరిగే తిరుపతి ఉప ఎన్నికలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం డిపాజిట్ దక్కితే చాలని భావిస్తున్నట్లు మంత్రి కొడాలి నానీ తనదైన శైలిలో కామెడీ చేశారు. తమ పార్టీ వైఎస్సార్సీపీ తిరుమల శ్రీవారి దయతో ఐదు లక్షల మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ గురించి ఆయన ఏమీ కామెంట్స్ చేయలేదు. బహుశా టైం వేస్ట్ అనుకున్నారేమో.