Janasena : జనసేన ఎదుగుదలకు జనసేనానే అడ్డంకి?

NQ Staff - December 1, 2023 / 02:22 PM IST

Janasena : జనసేన ఎదుగుదలకు జనసేనానే అడ్డంకి?

Janasena :

పవన్ కల్యాణ్.. ప్రజారాజ్యంలో చురుగ్గా వ్యవహరించారు. ఆ పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో కలిపేశాక..ఇక అన్నయ్యతో రాజకీయంగా కలిసి ఉండలేక జనసేన పార్టీని స్థాపించుకున్నాడు. ఆ పార్టీని పెట్టి పదేళ్లు అవుతోంది. అయినా ఇంతవరకు కనీసం అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయాడు పవన్. జనసేన ఎదుగుదలకు పాటుపడాల్సిన అధ్యక్షుడు.. పక్క పార్టీల పల్లకీలు మోయడానికే టైం కేటాయిస్తుండడంతో జనసైనికులు మండిపడుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి పల్లకి మోశారు. 2019ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాలతో కలిసి పోటీ చేసి కేవలం రాజోలు నియోజకవర్గంలో మాత్రమే గెలిచారు. జనసేనాని పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.

ఇక రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో ముందుగానే పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, ఎన్నికల సమయానికి పవన్ ప్లేటు ఫిరాయించి టీడీపీతో పొత్తుకు సై అన్నారు. ఏపీలో బీజేపీతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్నాడు. తెలంగాణలో టీడీపీతో సంబంధం లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన.. 8 చోట్ల పోటీ చేసింది. మరి ఎన్ని స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకుంటుందో చూడాలి.

ఏపీలో జనసేనకు సీట్ల కేటాయింపు విషయంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు చెపుతున్నారు. తెలంగాణలో జనసేన పోటీ చేసిన 8 స్థానాల్లో సాధించే ఓట్లను బట్టి టీడీపీ సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సీఎం జగన్ పై ఉన్న ద్వేషంతో పవన్ అడుగడుగునా తప్పులు చేస్తూ వెళ్తున్నారనే ప్రచారం నడుస్తోంది. జగన్ ను గద్దె దించాలనే చంద్రబాబు జీవితాశయాన్ని నెరవేర్చేందుకు పవన్ తహతహలాడుతున్నారు. అంతే తప్పా జనసేన ఎదగడానికి ఆయన ఏం చేస్తున్నట్టు? అని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించడం, ఆ తర్వాత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించడం ద్వారా తన పార్టీకి తానే నష్టం చేకూరుస్తున్నారని ఆయన అభిమానులే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.

బలమైన వైసీపీని ఎదుర్కొవాలంటే టీడీపీకి జనసేన అవసరం ఉంటుందన్నది ఓపెన్ సిక్రేటే. ఈ పాయింట్ ప్రకారం.. పవన్ రాజకీయంగా తెలివైన వాడే అయితే టీడీపీనే తన కాళ్ల దగ్గరకు రప్పించుకోవాలి. అప్పుడే పవన్ అడిగిన సీట్లను ఇచ్చేందుకు టీడీపీ ఒప్పుకునేది. అందుకు విరుద్ధంగా పవనే చంద్రబాబు కాళ్ల దగ్గరికి వెళ్లేసరికి.. ఆయనంటే టీడీపీ వాళ్లకు చులకనభావం ఉంది. ఇదిలా ఉండగా తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం కూడా ఆ పార్టీకి పెద్ద మైనస్సే. ఎందుకంటే పోటీ చేసిన 8చోట్ల డిపాజిట్లు గల్లంతైతే రేపటి ఏపీ ఎన్నికల్లో జనసేనపై పాజిటివ్ వైబ్స్ రావడం కష్టమే. తెలంగాణలో ఏమాత్రం బలమే లేకుండా పోటీ చేయడమనేది పవన్ చేసిన పెద్ద తప్పు. ఇది రేపటి ఏపీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

ఇలా 2014 నుంచి రాజకీయంగా తప్పులు చేస్తూనే వస్తున్నారు. ఇలాగైతే పార్టీ డెవలప్ ఎప్పుడవుతుంది.. అధికారంలోకి కాదు కదా.. ఓ పది సీట్లైనా గెలుచుకునే పరిస్థితి ఉంటుందా? అని జనసైనికులు అనుమాన పడుతున్నారు. ఇప్పటికే పదేండ్ల నుంచి పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఖర్చులు నాయకులు ఖర్చు పెట్టలేకపోతున్నారు. మళ్లీ 2024లో టీడీపీతో పొత్తు వల్ల నష్టం చేకూరితే ఇక పార్టీ కోలుకోవడం కష్టమేనని వాపోతున్నారు. పార్టీని వేరే ఎవరో నాశనం చేయాల్సిన అవసరం లేదని, జనసేనాని పవన్ కల్యాణే ఆ పని చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us