Janasena: అయ్ పాయ్.. నిన్న తెలంగాణలో.. నేడు ఏపీలో..

Janasena బీజేపీజనసేన పార్టీల మధ్య పొత్తు చిత్తు కాబోతోందా అంటే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి. నిన్న ఆదివారం హైదరాబాద్ లో పార్టీ ఆవిర్భావ సమావేశంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీ తమ పట్ల వ్యవహరిస్తున్న అవమానకరమైన తీరును ఎండగట్టాడు. ఇవాళ సోమవారం ఏపీ బీజేపీ తమకు సహాయ నిరాకరణ చేయటాన్ని ఏపీ జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ పట్టిచూపాడు. అంతేకాదు. కమలనాథులతో కలిసి నడవాలా వద్దా అనే విషయంలో జనసేన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పాడు. ప్రజలైతే బీజేపీతో జనసేనకు పొత్తు వద్దే వద్దు అంటున్నారని పోతిన సంచలన వ్యాఖ్యలు చేశాడు. విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏమన్నాడంటే..

బెజవాడలో ఓటమికి..

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన క్యాండేట్లు ఓడిపోవటానికి బీజేపీతో పొత్తే ప్రధాన కారణమని పోతిన మహేష్ తేల్చిచెప్పాడు. ఈ రెండు పార్టీలు కూటమిగా పోటీ చేయటం వల్ల అల్ప సంఖ్యాక వర్గాల ఓటర్లు ఆదరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘కమలనాథులతో కలిసి తిరిగిన కారణంగా బెజవాడలో మా పార్టీకి తీరని నష్టం జరిగింది. ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు మమ్మల్ని వ్యతిరేకించారు. విజయవాడ వెస్ట్ సెగ్మెంట్ లో కచ్చితంగా గెలుస్తాం అనుకున్న స్థానాల్లో కంగుతినాల్సి వచ్చింది. కొవిడ్-19 సమయంలో స్థానికులకు మా పార్టీ ఎంతో అండగా నిలబడింది. ప్రజల సమస్యలపై పోరాటం చేసింది. మా అభ్యర్థులకు కాషాయం పార్టీ వాళ్లు కనీసం సహకరించలేదు. ఫీల్డ్ లెవల్ లో మమ్మల్ని గాలికి వదిలేశారు. జెండా పట్టుకునేవాడే లేకుండాపోయాడు. వీటన్నింటినీ హైకమాండ్ కి రిపోర్ట్ రూపంలో ఇస్తా’’ అని పోతిన మహేష్ పేర్కొన్నాడు.

తిరుపతీ.. గోవిందేనా..

నిన్న వెలువడ్డ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఏపీలో ప్రతిపక్షాలకు బొమ్మ కనపడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వీటికితోడు పవన్ కళ్యాణ్, పోతిన మహేష్ అభిప్రాయాలు వింటుంటే బీజేపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగటం కష్టమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఈ రెండు పార్టీల విజయావకాశాలూ గోవిందేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవునూ.. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఇంకా రియాక్ట్ కాలేదేంటబ్బా..

Advertisement