Jagga Reddy : వైఎస్సార్ చనిపోతే, సీఎం కుర్చీపై షర్మిల, వైఎస్ జగన్ కొట్లాట: ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణ.!
NQ Staff - September 27, 2022 / 09:14 AM IST

Jagga Reddy : ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారన్న విషయం తెలిసి కాంగ్రెస్ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. మేమంతా ఏడుస్తూ వున్నాం. భర్తను కోల్పోయిన భార్యనీ, తండ్రిని కోల్పోయిన పిల్లలు జగన్, షర్మిలను ఓదార్చేందుకు మేం వెళ్ళాం. అక్కడ వాళ్ళను చూసి షాక్ అయ్యాం..’ అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి.
‘మా నాయకుడు చనిపోయాడని మేం ఏడుస్తోంటే, లోపల షర్మిల, వైఎస్ జగన్ మధ్య సీఎం కుర్చీ విషయమై గొడవ నడుస్తున్నట్లుంది. షర్మిల మాకు దూరంగా వుంది. వైఎస్ జగన్, మమ్మల్ని ఓదార్చుతున్నాడు. ఆయనలో అస్సలు బాధ కనిపించలేదు. షర్మిల కూడా అంతే..’ అంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలిప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి కారణమవుతోంది.
వైఎస్సార్ మరణం వెనుక కుట్ర వుందా.? వైఎస్సార్ మరణం వెనుక కుట్ర వుందనీ, ఆయన్ని కుట్ర చేసి చంపేశారనీ ఇటీవల పాదయాత్ర సందర్భంగా వైఎస్ షర్మిల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై పలువురు కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు.
‘ఆరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఇంటి నుంచి బయల్దేరారు. వైఎస్ విజయమ్మ హారతినిచ్చింది. కుటుంబ సభ్యులే ఆయన్ని సాగనంపారు.
ఆ తర్వాత ఏం జరిగిందో మాకేం తెలుసు.? వైఎస్సార్ చుట్టూ ఆయనకు అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులే వుంటారు. వైఎస్ మరణం వెనుక కుట్ర వుంటే, ఆ సన్నిహితులు.. కుటుంబ సభ్యులకే ఆ కుట్రల గురించి తెలియాలి..’ అని ఇప్పటికే పలవురు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. తాజాగా జగ్గారెడ్డి, వైఎస్ మరణం తర్వాత షర్మిల, వైఎస్ జగన్ మధ్య జరిగిన సీఎం కుర్చీ గొడవ గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.