Jagan: యూట‌ర్న్ తీసుకున్న జ‌గ‌న్.. బిల్లు వెన‌క్కు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన జ‌గ‌న్

Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీంతో మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వికేంద్రీక‌ర‌ణ బిల్లు, సీఆర్డీఏ బిల్లుల‌ను కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్టు బుగ్గ‌న ఓ ప్ర‌క‌ట‌నలో తెలిపారు. అయితే అసెంబ్లీలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఈ డబ్బుతో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వేయడం కూడా సాధ్యం కాదన్నారు.

jagan-taken-u-turn2
jagan-taken-u-turn2

ఇలాంటప్పుడు రాజధాని ఏర్పాటు సాధ్యమేనా? పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే నగరం ఎప్పటికి వస్తుంది? అని ప్రశ్నించారు.చదువుకున్నవాళ్లంతా పెద్ద నగరాలైన బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా? ఎప్పటికీ మనకు మార్పు ఉండదా అని అడిగారు.

ఇప్పుడు ఏపీలో పెద్ద నగరం విశాఖపట్నం అని, అక్కడ ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయని, సుందరీకరణ, వసతులపై శ్రద్ధ పెట్టి, విలువ పెంచితే ఐదు, పదేళ్లలో హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో కచ్చితంగా పోటీ పడుతుందని జగన్ చెప్పారు.

ఇది వాస్తవ పరిస్థితి అని, ఇలాంటి వాస్తవాలను గుర్తెరిగే.. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి, రాష్ట్రం పరిగెత్తాలనే తాము విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, అమరావతిలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలని నిర్ణయించామన్నారు. అయితే, తమ నిర్ణయంపై రకరకాల అపోహలు రేకెత్తించి, న్యాయపరమైన చిక్కులు కల్పిస్తున్నారని చెప్పారు.

తాము ప్రకటించిన వెంటనే పనులు ప్రారంభించి, అమల్లోకి తీసుకొస్తే ఈపాటికే వికేంద్రీకరణ ఫలితాలు చూసేవాళ్లమని జగన్ ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో కేంద్రీకరణ ధోరణులను ప్రజలు వ్యతిరేకించారని, మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దని, అలాంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడకూడదని ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.

అన్ని ప్రాంతాలూ, కులాలు, వారి ఆశలు, ఆంకాంక్షలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని, ఆవిష్కరించిందని.. కాబట్టే తమ ప్రభుత్వాన్ని గత రెండున్నరేళ్లలో ప్రజల ప్రతి ఎన్నికలోనూ దీవిస్తూ వచ్చారన్నారు. వికేంద్రీకరణ గురించి అనేక అపోహలు, అనుమానాలు, దుష్ప్రచారాలు, న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసులు.. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి దుష్ప్రచారం చేశారన్నారు.

మూడు రాజధానుల బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, బిల్లుల్ని మరింత మెరుగు పర్చేందుకు, అన్ని ప్రాంతాలకూ, అందరికీ విస్తృతంగా వివరించేందుకు, ఇకేమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపర్చేందుకు ఇంతకు ముందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని వెనక్కు తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో ప్రభుత్వం సభ ముందుకు వస్తుందన్నారు.