Vishaka : HPCL రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం

Vishaka: విశాఖపట్నం మరోసారి వార్తల్లో నిలిచింది. అక్కడి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) రిఫైనరీలో ఇవాళ మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రాణ నష్టం వివరాలు ప్రస్తుతానికి వెల్లడి కాలేదు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన పని ప్రదేశంలో ఆరుగురు సిబ్బందితోపాటు మరికొంత మంది లేబర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పదుల సంఖ్యలో ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. బాధితులకు వైద్య సేవలను అందించేందుకు కొన్ని అంబులెన్సులని కూడా రెడీగా ఉంచారు. ముడి చమురును ప్రాసెస్ చేసే యూనిట్ మొత్తం మంటల్లో చిక్కుకున్నట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇక్కడ మొత్తం మూడు రిఫైనరీ యూనిట్లు ఉండగా సీడీయూ అనే మూడో యూనిట్ లో ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నారు.

Vishaka HPCL Refinery

దట్టమైన పొగ.. పెద్ద శబ్దం..

హెచ్పీసీఎల్ లో ప్రమాదం జరగటంతో దట్టమైన పొగ వెలువడుతోంది. పెద్ద శబ్దం కూడా వినిపించిందని స్థానికులు తెలిపారు. మూడు సైరన్లను మోగించారంటేనే యాక్సిడెంట్ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మాత్రమే ఇలా మూడు సైరన్లను ఒకేసారి మోగిస్తారని పోలీసులు అంటున్నారు. సైరన్ల సౌండ్ విని ఉద్యోగులు చాలా మంది సురక్షితంగా బయటకు వచ్చారని వెల్లడించారు. యాక్సిడెంట్ చోటుచేసుకున్నది పాత టెర్మినల్ వద్దని వెల్లడిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా ఈ అనుకోని సంఘటన జరగటంతో గాజువాక, మల్కాపురం ప్రాంతవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

Vishaka HPCL Refinery

స్టోరేజ్ ట్యాంక్ పేలిందా?..

‘‘ముడి చమురును ప్రాసెస్ చేసే సమయంలో పేరుకుపోయిన కర్బన పదార్థాలు తరచూ పేలుతుండటం సహజం. అయితే ఈసారి ఇంధనాన్ని నిల్వ చేసే పెద్ద ట్యాంకే బ్లాస్ట్ అయుంటుంది. ఎగసిపడుతున్న మంటల తీవ్రతను బట్టి కూడా ప్రమాద స్థాయి ఏంటనేది అంచనా వేయొచ్చు. మూడో యూనిట్ చాలా సెన్సిటివ్. మండే అవకాశం ఎక్కువగా ఉన్న పదార్థాలనే ఇక్కడ స్టోర్ చేస్తుంటారు. అందుకే అగ్నిమాపక సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారు. కాకపోతే ఈ మంటలు నీళ్లతో ఆరవు. ప్రత్యేక రసాయనాలతో ఆపాలి. ఈ నేపథ్యంలో వైజాగ్ నుంచి కూడా కొన్ని ఫైరింజన్లని తెప్పించారు’’ అని సంబంధిత వర్గాలు వివరించాయి.