Ganta: తెలంగాణలోనూ మోగిన ‘గంట’..

Ganta  గంటా శ్రీనివాస రావు. ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే (విశాఖ ఉత్తర నియోజకవర్గం). విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మొట్ట మొదట రాజీనామా చేసిన ప్రజాప్రతినిధి. తద్వారా ఉక్కు కర్మాగార పరిరక్షణ పోరాటానికి గంట మోగించిన ఆయన ఇవాళ శనివారం తెలంగాణకూ వచ్చారు. ఇక్కడ కూడా ఆ ఉద్యమ జేగంట కొట్టారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ని అసెంబ్లీలో కలిశారు. నిన్న సెలవు కావటంతో ఈరోజు పున:ప్రారంభమైన శాసన సభలో కేటీఆర్ బిజీగా ఉండటంతో తేనీటి విరామ సమయంలో ఈ భేటీ జరిగింది. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఫైట్ కి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకి ఏపీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చానని గంటా శ్రీనివాస రావు స్పష్టం చేశారు.

ఒక్కడు కాదు..

ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిస్తే, ఆదేశిస్తే స్వయంగా వైజాగ్ వెళ్లి విశాఖ పోరాటంలో పాల్గొంటానని, ఉద్యమకారులకు సంఘీభావం తెలుపుతానని కేటీఆర్ అప్పట్లో ప్రకటించిన విషయం విధితమే. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఒక్కణ్ని మాత్రమే కాదు. కొంత మంది మంత్రులతో కలిసి గ్రూపుగా వస్తామని, అసెంబ్లీ సమావేశాల ముగింపు అనంతరం ఈ పర్యటన ఉంటుందని కేటీఆర్ చెప్పినట్లు గంటా శ్రీనివాస రావు తెలిపారు. వీరిద్దరి సమావేశంలో విశాఖ టాపిక్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

మరో రెండు గంటల్లో..

ప్రైవేట్ కి అమ్మేసే నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదంటూ కేంద్రం పదే పదే ప్రకటిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస రావు అనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఇవాళ సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకి సూసైడ్ చేసుకుంటానంటూ పేర్కొన్న లేఖ కలకలం రేపుతోంది. ఉదయం 5 గంటల షిఫ్టులో డ్యూటీకి వెళ్లిన అతను తన టేబుల్ వద్ద ఈ లెటర్ పెట్టి కనిపించకుండా పోయాడు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. అతని ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఉక్కు కొలిమిలో అగ్ని ఆహుతవుతానంటూ శ్రీనివాస రావు చెప్పటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement