Gangula Kamalakar : జగన్ కుటుంబంలో చిచ్చు పెట్టావ్.. కేసీయార్ కుటుంబంలో చిచ్చు పెట్టలేవ్ : సజ్జలపై తెలంగాణ మంత్రి ఫైర్.!
NQ Staff - October 1, 2022 / 11:08 PM IST

‘వైఎస్ జగన్ కుటుంబంలో చిచ్చు పెట్టావ్.. వైఎస్ జగన్ నుంచి విజయమ్మనీ, వైఎస్ షర్మిలనీ దూరమవడానికి నువ్వే కారణం. ఇప్పుడు కేసీయార్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా.?’ అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మంత్రి గంగుల కమలాకర్.
‘హరీష్ రావు మాట్లాడిందేంటి.? మీరు మాట్లాడుతున్నదేంటి.? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలన ఎలా వుందో అక్కడి ప్రజలే చెబుతున్నారు. అక్కడి నుంచి తెలంగాణలోకి వలసలు పెరిగాయంటే దానర్థమేంటి.? దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కానన్ని ఎక్కువ సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయ్.. హరీస్ రావు మీద వ్యక్తిగతంగా దాడి చేస్తే ఊరుకునేది లేదు.
కేసీయార్ కుటుంబంలో చిచ్చు పెట్టాలనుకుంటే మీ ఆటలు సాగనీయం..’ అని గంగుల కమలాకర్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డినీ అలాగే మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ తదితరుల్నీ హెచ్చరించారు.
తెలంగాణ కెలుకుడు.. ఆంధ్రప్రదేశ్ చెడుగుడు…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అధికార పార్టీల మధ్య ఈ మాటల యుద్ధం కొత్త అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణలో రాజకీయంగా మరింత బలపడే ప్రయత్నంలో ఏపీ వర్సెస్ తెలంగాణ రచ్చ చేసి, తెలంగాణ సెంటిమెంట్ రాజేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి చూస్తున్నట్లుంది.
తెరవెనుకాల టీఆర్ఎస్ – వైసీపీ మధ్య వున్న అవగాహన నేపథ్యంలో టీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తూ, పరోక్షంగా ఆ పార్టీ పట్ల తెలంగాణ సమాజంలో సింపతీ పెంచేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్లుంది.
ఒక్కటి మాత్రం నిజం.. వైఎస్ జగన్‌కి షర్మిల దూరమవడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలైతే గతంలో వినిపించాయి. ‘సజ్జల తీరు నాకు బాధ కలిగించింది..’ అని గతంలో వైఎస్ షర్మిల కూడా వ్యాఖ్యానించారు.