Butta Renuka: ఒట్టేసి చెబుతున్న.. బుట్టా రేణుక..

Butta Renuka: ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత ప్రజాకర్షణ కలిగిన లేడీ లీడర్స్ లో బుట్టా రేణుక ఒకరు. అత్యధిక ఆస్తిపాస్తులు గల కుటుంబాల్లో ఈమెది కూడా ఒకటి. అయితే ఈ మాజీ ఎంపీ రాజకీయంగా నిలకడలేమిని ప్రదర్శించటంతో నిలదొక్కుకోలేకపోయారు. పొలిటికల్ గా మరోసారి ఇవాళ గురువారం వార్తల్లో నిలిచారు. తాను మరోసారి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బుట్టా రేణుక ఖండించారు. అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ పుకార్లేనని చెప్పారు. నమ్మొద్దని కోరారు. ప్రస్తుతం అధికార పార్టీలో సౌకర్యవంతంగానే ఉన్నానని, రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని తెలిపారు. బుట్టా రేణుక పార్టీ మారబోతున్నారనే ప్రచారం అసలు ఎందుకు జరుగుతోందంటే..

 

గతాన్ని బట్టే..

బుట్టా రేణుక 2014లో కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి, తెలుగుదేశం పార్టీ గాలి బలంగా వీచినప్పటికీ తట్టుకొని నెగ్గారు. దీన్నిబట్టి ఆమెకి, వైఎస్సార్సీపీకి అక్కడ ఎంత ప్రజాదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే బుట్టా రేణుక ఆ సెగ్మెంట్ ప్రజల సెంటిమెంట్ ని, నమ్మకాన్ని వమ్ము చేసి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేశారు. దీంతో ఆమెకి ఓటేసి గెలిపించినోళ్లు చాలా బాధపడ్డారు. అందునా జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన్ని వదిలేసి పోవటాన్ని జీర్ణించుకోలేకపోయారు. పోతే పోయారు. ఆ పార్టీలోనైనా స్థిరంగా ఉండొచ్చుగా అంటే అదీ లేదు. తెలుగుదేశం పార్టీ మళ్లీ కర్నూల్ ఎంపీ టికెట్ ని బుట్టా రేణుకని ఇచ్చే ఛాన్స్ లేకపోవటంతో ఆమె 2019 ఎన్నికలకి ముందు మరోసారి వైఎస్సార్సీపీ గూటికి చేరారు.

అయినా.. అదే గతి..

వైఎస్సార్సీపీలోకి వస్తే రెండోసారి కర్నూల్ టికెట్ కొట్టేయొచ్చని బుట్టా రేణుక ప్లాన్ వేశారు. కానీ జగన్ ఆమెకి ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ మాదిరిగా బుద్ధి చెప్పారు. ఒకవేళ ఆయన బుట్టా రేణుకకి టికెట్ ఇచ్చారనుకుందాం. లక్కీగా వరుసగా రెండో సారి గెలిచారనుకుందాం. అప్పుడైనా వైఎస్సార్సీపీలోనే కొనసాగుతారనే గ్యారెంటీ లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే అందులోకి జంప్ చేయరని నమ్మకమేంటి? అందుకే జగన్ బుట్టా రేణుకని పక్కన పెట్టాడు. రెండేళ్లవుతున్నా ఆమెకి పదవేమీ ఇచ్చే సూచనలు కనిపించట్లేదు. అందుకే పార్టీ మారాలని భావించినట్లున్నారు. అది కాస్తా బయటికి పొక్కటంతో తోసిపుచ్చారు. పాలిటిక్స్ లో ఉన్నంత కాలం వైఎస్సార్సీపీలోనే కంటిన్యూ అవుతానంటూ ఒట్టేసి చెబుతున్న బుట్టా రేణుక మాటలని ఆమె నియోజకవర్గ ప్రజలు నమ్మకపోవచ్చు.

Advertisement