AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవాళ రెండు శుభవార్తలు..

AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవాళ శుక్రవారం రెండు శుభవార్తలు వినిపించాయి. ఒకటి.. కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో తగ్గాయి. రెండు.. అన్ని జిల్లా కేంద్రాల్లో హెల్త్ క్లబ్బులు రానున్నాయి. కొద్ది రోజులుగా ఏపీలో నిత్యం పాతిక ముప్పై వేల మధ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుండగా ఈరోజు ఒక్కసారిగా సగానికి సగం తగ్గిపోవటం గమనార్హం. గడచిన 24 గంటల్లో 14,429 మందే ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే.. చనిపోతున్నవారి సంఖ్య మాత్రం పెద్దగా తగ్గట్లేదు. రోజూ వంద మందికి అటు ఇటుగా ప్రాణాలు కోల్పోతుండటం కాస్త ఆందోళన కలిగించే అంశమే.

ap

కొత్తగా 80 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్..

వచ్చే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రదేశాల్లో హెల్త్ క్లబ్బులను ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఒక్కో ఏరియాలో కనీసం 30 నుంచి 50 ఎకరాల భూమిని సేకరించి, ప్రతి చోటా ఆస్పత్రి నిర్మాణానికి ఐదెకరాలు కేటాయించాలని సీఎం సూచించారు. హెల్త్ క్లబ్బుల వల్ల జిల్లా కేంద్రాలతోపాటు మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం 80 మల్టీ-సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయని చెప్పారు. మరో వైపు గవర్నమెంట్ తరఫున 16 మెడికల్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రైవేట్ రంగంలోనూ మంచి ఆస్పత్రులు వస్తాయని తెలిపారు.

ap

వేరే సిటీలకు ఎందుకు వెళ్లాలి?..

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీ ప్రజలు అత్యవసర, మెరుగైన వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లాల్సి వచ్చింది. వేరే రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఆలోచించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కొవిడ్ నియంత్రణ, రాష్ట్రంలో వైద్య సదుపాయాలు అనే అంశంపై ఆయన ఇవాళ సమీక్ష నిర్వహించారు. హెల్త్ క్లబ్బులు అందుబాటులోకి వస్తే పక్క రాష్ట్రాలను ఆశ్రయించాల్సిన అవసరం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద మంచి ట్రీట్మెంట్ ఇవ్వొచ్చని, ఈ మేరకు కొత్త పాలసీని నెల రోజుల్లో రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని హాస్పిటల్స్ లో కూడా బెడ్లు లేని పక్షంలో ఇటీవల ఏపీ నుంచి వచ్చే కరోనా పేషెంట్ల వాహనాలను తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లోనే నిలపేయటం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.

ap