Andhra Pradesh : విభజనకు దారితీయనున్న వికేంద్రీకరణ.! ఏపీలో మళ్ళీ అదే తప్పు జరుగుతోంది.!
NQ Staff - October 12, 2022 / 09:47 PM IST

Andhra Pradesh : ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగినప్పుడు, మొత్తంగా తెలంగాణ సమాజం అంతా ఒక్కతాటిపైకి వచ్చింది. రాజకీయ పార్టీలు జెండాల్ని పక్కన పడేసి మరీ, తెలంగాణ ఉద్యమ జెండా పట్టుకున్నట్లే వ్యవహరించాయి. చిన్న చిన్న అభిప్రాయ బేధాలున్నాగానీ, అన్ని పార్టీలూ జేఏసీ గొడుగు కిందకు వచ్చి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాయి.
కానీ, సమైక్యాంధ్ర నినాదంతో సీమాంధ్ర ప్రజా ప్రతినిథులు అడ్డగోలు రాజకీయం చేశారు. ‘విడిపోతే తప్పేంటి.?’ అంటూ బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ పొలిటీషియన్స్, సమైక్య ఉద్యమానికి తూట్లు పొడిచారు. రాయలసీమకు చెందిన కొందరు నాయకులు, ‘రాయలసీమ కావాలి..’ అంటూ నినదించి, సమైక్య ఉద్యమాన్ని దెబ్బతీశారు.
వికేంద్రీకరణ ముసుగులో విధ్వంసం.?
ప్రస్తుతం వికేంద్రీకరణ పేరుతో పెయిడ్ ఉద్యమం నడుస్తోంది. అది అధికార వైసీపీ సృష్టించిన ఉద్యమం. మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రలోనూ, రాయలసీమలోనూ సెంటిమెంట్‌ని రెచ్చగొడుతోంది. పరిస్థితి చూస్తోంటే, ఈ వికేంద్రీకరణ ఉద్యమం కూడా విభజనకు దారి తీస్తుందా.? అన్న ఆందోళన చాలామందిలో వ్యక్తమవుతోంది.
అగ్ని గుండం.. తరిమికొడతాం.. ఇలాంటి మాటలు తెలంగాణ ఉద్యమంలో గట్టిగా వినిపించాయ్.. ఇప్పుడు అవే మాటలు ఏపీలో వినిపిస్తున్నాయ్. ప్రజలు ఎప్పుడూ ప్రాంతాల వారీగా విడిపోరు. రాజకీయ నాయకులే విడిపోయినట్లు నటిస్తారు.. అంతిమంగా లాభపడేది రాజకీయ నాయకులు.. నష్టపోయేది ప్రజలు.