Roja-Ali: రోజా.. రూ.25 లక్షలు. అలీ.. రూ.2 లక్షలు..

Roja-Ali: కరోనా బాధితులను ఆదుకునే విషయమై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, ప్రముఖ హాస్య నటుడు అలీ వార్తల్లో నిలిచారు. ఏపీఐఐసీ చైర్మన్ కూడా అయిన రోజా చిత్తూరు జిల్లా పుత్తూరు కేకేసీ కాలేజీలో ఏర్పాటుచేసిన కొవిడ్ కేర్ సెంటర్ కి రూ.25 లక్షల విలువైన వైద్య పరికరాలను అందజేశారు. నగరిలోని రోజా ఇంటి వద్ద ఆమె సోదరుడు రామ్ ప్రసాద్ రెడ్డి వీటిని సంబంధిత కేర్ సెంటర్ ప్రత్యేక అధికారికి నిన్న ఆదివారం ఇచ్చారు. రోజాను స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా సహకారం అందించేందుకు ముందుకు వచ్చినట్లు బెంగళూరుకు చెందిన మింత్రా కార్పొరేట్ సంస్థ సీఆర్వో అమర్ అన్నారు. ఈయన 15 ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లను రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. విజయపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. కొవిడ్ కేర్ సెంటర్ కి అవసరమైన మందుల దగ్గర నుంచి ప్రతిదీ శాసనసభ్యురాలు రోజా సమకూరుస్తున్నారని డాక్టర్ రవిరాజు తెలిపారు.

Roja-Ali

130 మంది ఆర్టిస్టులకు సాయం..

పాపులర్ కమెడియన్ అలీ, అతని సతీమణి, సోదరుడు నిన్న ఆదివారం హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంతంలోని ఇందిరానగర్ లో 130 మంది సినీ కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు. రూ.2 లక్షలు ఖర్చు పెట్టి ప్రతిఒక్కరికీ పది కిలోల చొప్పున బియ్యం, గోధుమ పిండి, పంచదారలతోపాటు 8 రకాల సరుకులు ఇచ్చారు. సినిమా షూటింగులు బంద్ కావటంతో ఈ పరిశ్రమను నమ్ముకొని బతుకుతున్నవారికి ఉపాధి కరువైంది. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో స్పందించిన అలీ తెలుగు సినిమా ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్ కి చెందిన కార్మికులకి అండగా నిలిచారు. కరోనా కష్ట కాలంలో తన వంతుగా సాటి కళాకారులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టానని అలీ తెలిపారు. ఇందులో నటుడు ఖయ్యూం, కరీమ్ పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్, యువ హీరో మంచు మనోజ్, నిఖిల్, సంపూర్ణేష్ బాబు, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ తదితరులు ఇటీవలి కాలంలో కొవిడ్ బాధితులకు ఆర్థిక, ఇతరత్రా సహాయాలు చేసిన విషయం విధితమే.

Roja-Ali