CM Jagan: ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ. ఏం కోరారంటే..

CM Jagan ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, వాటిని కట్టడి చేయటానికి రాష్ట్రానికి 60 లక్షల కొవిడ్-19 డోసుల వ్యాక్సిన్ పంపించాలని కోరారు. టీకా ఉత్సవ్ లో భాగంగా ఒకే రోజు 6 లక్షల 28 వేల 961 డోసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయంలో ఏ రాష్ట్రంతో పోల్చినా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ డోసులు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషించిందని సీఎం జగన్ వివరించారు.

cm jagan ap
cm jagan ap

వచ్చే 3 వారాల్లో..

‘‘రానున్న మూడు వారాల్లో ఏపీలో 45 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికీ కరోనా టీకా వేస్తాం. ఈ మేరకు 60 లక్షల డోసులు అవసరం. సరిపడా కేటాయిస్తారని ఆశిస్తున్నాం. అర్హత ఉన్న అందరికీ వ్యాక్సిన్ అందేలా చూస్తాం. రాష్ట్రంలోని ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ని అందుబాటులో ఉంచి వాళ్ల అవసరాలు తీరుస్తున్నాం. వ్యాక్సిన్ డ్రైవ్ లో వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి జగన్ ప్రధానమంత్రి మోడీకి తెలిపారు.

కరోనా కంట్రోల్ పై రివ్వ్యూ..

అంతకుముందు (ఉదయం 11 గంటలకు) జగన్ సీఎం క్యాంపు ఆఫీసులో ఏపీలో కరోనా నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్-19ని కంట్రోల్ చేసే చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల ఉన్నతాధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ మేరకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రికార్డు లెవల్ లో వ్యాక్సినేషన్ వేసినందుకు సీఎం వైఎస్ జగన్ అభినందించారు.

నిన్నటి సమీక్షలో..

కొవిడ్-19 సోకినవారు ఫ్రీ ట్రీట్మెంట్ పొందేలా గైడ్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. 104 కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తే అన్ని విధాలా సహాయ సహకారాలు అందేలా చూడాలన్నారు. ఫోన్ చేసిన 3 గంటల్లోగా కరోనా పేషెంట్లకు బెడ్ కేటాయించాలని కోరారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలన్నారు. హోం ఐసోలేషన్ లో ఉన్నోళ్లని ఫాలో అప్ చేయాలని, ప్రైమరీ కాంటాక్టులకు టెస్టులు చేయాలని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫీజుల వివరాలు పేషెంట్లకి అర్థమయ్యేలా సింపుల్ గా బోర్డులు పెట్టాలని సూచించారు. వ్యాక్సినేషన్ పై ఫోకస్ పెట్టాలని, కేంద్రానికి లేఖ రాయాలని, అవసరమైతే తానూ రాస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చెప్పినట్లుగానే ఆయన ఇవాళ ప్రధాని మోడీకి లెటర్ రాశారు.

Advertisement