CM Jagan: ఆనందయ్య మందుకి సీఎం జగన్ ఓకే?..

CM Jagan: కరోనా వైరస్ వ్యాప్తికి కరెక్ట్ విరుగుడు కృష్ణపట్నం వైద్యమేనని జనం భావిస్తున్న నేపథ్యంలో ఆ మందుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు ఆనందయ్య ఇవాళ ఆదివారం చెప్పాడు. జనం మంచి కోరే తాను ఈ ఔషధాన్ని తయారుచేస్తున్నట్లు తెలిపాడు. మందు పంపిణీపై సర్కారు నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని పేర్కొన్నాడు. ఒక వేళ గవర్నమెంట్ ఓకే చెబితే వేల మందికి మెడిసిన్ ని తయారుచేయటానికి చాలా సమయం పడుతుందని స్పష్టం చేశాడు. తన పేరు చెప్పి కొంత మంది ఆ మందును విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య తాను ఇచ్చిన పసరు వల్లే ఇబ్బందిపడ్డాడని అనటం సరికాదని, ఆయనకు మందు ఇచ్చి నాలుగు రోజులే అయిందని ఆనందయ్య వివరించాడు.

అనుమతి రాకపోయినా..

ఆనందయ్య తయారుచేస్తున్న ఈ నేచురల్ మెడిసిన్ కరోనాకి సరైన మందు కాదని గవర్నమెంట్ చెప్పినా సరే ఇమ్యూనిటీ బూస్టర్(వ్యాధి నిరోధక శక్తిని పెంచేది)గా పరిశీలిస్తామని, ఈ మేరకు ఆయుర్వేద ఫార్మసీలో ప్రణాళికలను రెడీ చేస్తున్నట్లు చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తేల్చిచెప్పారు. శేషాచలం అడవుల్లో వన మూలికలు పెద్ద మొత్తంలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆనందయ్య ఔషధంలో సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే పదార్థాలేవీ లేవని ఆయుర్వేద డాక్టర్లు చెబుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మేరకు శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాస ఆయుర్వేదిక్ ఫార్మసీలో వైద్యులతో భేటీ అయ్యారు. ఆనందయ్య మందుకు అనుమతులు వస్తే చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

మెడికల్ మాఫియాకు లొంగం..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు మెడికల్ మాఫియాకి లొంగే ప్రభుత్వం కాదని సర్వేపల్లి శాసన సభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆనందయ్య మెడిసిన్ పై దుష్ప్రచారం చేయొద్దని కోరారు. ఆయన్ని ఎవరూ అరెస్ట్ చేయలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించిన తర్వాతే మందు పంపిణీకి చర్యలు చేపడతామని చెప్పారు. ఆనందయ్య ఔషధం కోసం జనం ఎగబడ్డారని, అది బాగా పనిచేస్తుందని చెప్పటానికి ఇది చాలని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.