CM Jagan: అంత్యక్రియలకి డబ్బులు. జగన్ సర్కార్ నిర్ణయం. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి..

CM Jagan: కరోనా బాధితుల ఆర్థిక కష్టాలను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వల్ల చనిపోయినవారి అంత్యక్రియలకు 15 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే జగన్ సర్కారు కరోనా ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయినా చాలా మందికి అంతిమ సంస్కారాలను నిర్వహించే ఆర్థిక స్థోమత కూడా ఉండట్లేదు. దీనిపై అధికార పార్టీ వైఎస్సార్సీపీ నాయకుల నుంచే ఇటీవల కొంత అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో గవర్నమెంట్ తగిన చర్యలను చేపట్టింది. కొవిడ్ రోగులను కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఆక్సీజన్, మందులు, ఇంజెక్షన్లు, కిట్లు తదితర కేటాయింపులను రాబట్టుకుంటోంది.

కొండదొరసానే..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సామాజికవర్గంపై కొందరిలో నెలకొన్న అస్పష్టత ఎట్టకేలకు తొలిగిపోయింది. ఆమె ఎస్టీల్లోని కొండదొర కులానికి చెందినవారని తేలిపోయింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. పుష్ప శ్రీవాణి కులంపై రేగు మహేష్ అనే న్యాయవాది పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. సమగ్ర దర్యాప్తు జరిపి కలెక్టర్ కి నివేదిక ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి నిర్ధారణ కమిటీ(డీఎల్ఎస్సీ)ని ఆదేశించింది. ఆ కమిటీ విచారణ చేసి ఆమె ఎస్టీల్లోని కొండదొర కులానికి చెందినవారేనని తేల్చిచెప్పింది. వివిధ సందర్భాల్లో పుష్ప శ్రీవాణి దాఖలు చేసిన క్యాస్ట్ సర్టిఫికెట్ సరైనదేనని స్పష్టం చేసింది.

హోం ఐసోలేషన్ లో..

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి దంపతులకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వాళ్లిద్దరు ప్రస్తుతం హోం ఐసోలేషన్ లోనే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పుష్పశ్రీవాణి సామాజికవర్గం విషయంలో నెలకొన్న గందరగోళం తొలిగిపోవటం ఆమెకు గుడ్ న్యూస్ అని అభిమానులు, విశ్లేషకులు అంటున్నారు.